TRINETHRAM NEWS

Free gas scheme on Diwali

త్వరలోనే రాజముద్రతో పాస్ పుస్తకాలు జారీ

దీపావళి రోజున ఉచిత గ్యాస్ పథకం

నాణ్యమైన మద్యం తక్కువ ధరలకే లభ్యం

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం/నందిగాం/మొండిరావివలస:

దీపావళి రోజున ఉచిత గ్యాస్ పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలం మొండి రావివలస గ్రామంలో శనివారం ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొండి రావివలస, ఆకులరఘునాధపురం, సుబ్బమ్మపేట గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలియజేయాలని గ్రామస్తులకు తెలియజేయగా గ్రామంలో విద్యుత్, రహదారి, తదితరమైన సమస్యలుపై గ్రామస్తులు మంత్రికి వివరించారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలన్ని శాఖలు తన దగ్గరే ఉన్నట్లు చెప్పారు. ఏ శాఖలో చూసినా అప్పులేనని, మొత్తం 12 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని కోలుకోని దెబ్బ తీశారన్నారు. వెంకటేశ్వరస్వామి ఆలయంలో సరఫరా చేసే లడ్డూలో జంతువుల కొవ్వును కలిపినట్లు చెప్పారు. వంద రోజుల్లో కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడం వలనే కొంత సంక్షేమం సాధించడమైనదని వివరించారు. కష్ట సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు.

ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు ఒకేసారి రూ. 1000 పెంచి రూ.4 వేలు ఇవ్వడం ఒకటైతే… మొదటి నెల ఒక్కొక్కరికీ రూ.7000/-లు చొప్పున ఒకరోజు రాష్ట్రం మొత్తం మీద 65.18 లక్షల మందికి ఇంటింటికీ వెళ్లి రూ.4,408 కోట్లు పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్రన్నారు. వాలంటీర్లు కంటే ముందుగానే అధికారులు ఫించన్లు అందజేయడమైనదని చెప్పారు. అర్హత లేనివారికి ఫించన్లు అని పేపర్లో వస్తే వాటిపై విచారణ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు తెలియజేయడం అయ్యింది అన్నారు.అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఫించను అందజేస్తామని, ఎవరైనా అర్హత లేనివారు ఫించన్లు తీసుకుంటే అలాంటి పేర్లు గ్రామస్తులే చెప్పాలని పేర్కొన్నారు.

మూడపూటలకు పూటకో వెరైటీలతో పేదవారి ఆకలి తీరుస్తున్నాయి అన్న క్యాంటీన్లు. పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించడమైనదని, ఇటీవల మరిన్ని క్యాంటీన్లు ప్రారంభిడమైనదని స్పష్టం చేశారు. మరిన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డీఎస్సీతో 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టడం జరుగుతోందన్నారు. ప్రజలకు నిద్ర లేకుండా చేసిన “ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్”ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడమైనదని, త్వరలోనే రాజముద్రతో పాస్ పుస్తకాలు జారీ చేస్తామన్నారు. తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పారు.

ఉద్యోగులకు 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నట్లు తెలిపారు. మొండి రావివలస – లకిదాసుపురం గ్రామాలకు రహదారి, మొండి రావివలసలో కళావేదిక ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తప్పకుండా పరిష్కారం చేస్తామన్నారు. విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఎలక్ట్రికల్ ఏఈ ని ఆదేశించారు.నందిగాం మండల రైతులకు మంచి జరుగుతుందన్నారు. గ్రామంలో ఉన్న సమస్య సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. వంద రోజుల పాలన సంతృప్తి నిచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే వివిధ కులాల వారికి రుణాలు అందజేస్తామని చెప్పారు. ఇంటిలో భర్త మరణిస్తే భార్యకు ఫించను వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో పలాస రెవెన్యూ డివిజనల్ అధికారి భరత్ నాయక్, నందిగాం మండల ప్రత్యేక అధికారి, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్, ఎంపిడిఓ, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App