TRINETHRAM NEWS

Trinethram News : క్వింటాలుకు ఏకంగా రూ. 18,299 పలికిన ధర
వారం క్రితంతో పోలిస్తే రూ. 3 వేలకు పైగా అధికం
12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
సాగు తగ్గడంతో డిమాండ్

పసుపు రైతుల పంట పండింది. గత ఆరేళ్లుగా నేల చూపులు చూస్తున్న పసుపు ధరలు వారం రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. వారం క్రితం క్వింటాలు పసుపు ధర రూ. 15,825 పలికి రికార్డులకెక్కింది. రైతులు ఆ సంతోషంలో ఉండగానే నిన్న మరోమారు రికార్డుస్థాయి ధర పలికింది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో నిన్న క్వింటాలు పసుపు ఏకంగా రూ. 18,299 పలికింది. గతవారం పలికిన ధరకంటే రూ. 3 వేలకుపైగా అదనంగా పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలోని పెర్కిట్‌‌కు చెందిన రైతు తీగల గంగారెడ్డి తీసుకొచ్చిన పసుపుకు ఈ ధర పలికింది. పసుపుకు ఇంత భారీ ధర రావడం 12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారని రైతులు చెబుతున్నారు. గత ఆరేళ్లుగా ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో పసుపు రైతులు ఈసారి సాగు తగ్గించారు. ఫలితంగా డిమాండ్ పెరిగి రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి.