TRINETHRAM NEWS

Trinethram News : దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. షెడ్యూల్ విడుదలకు ఎంతో సమయం లేదు. గడువు సమీపించింది. ఇంకో రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ విడుదల కానుంది.

దీనితో పాటే- దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది.

ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒడిశాలో బిజూ జనతాదళ్, అరుణాచల్ ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ, సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా- బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.

2019 తరహాలోనే దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో పోలింగ్ పూర్తి అయ్యేలా కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు షెడ్యూల్‌ను రూపొందించినట్లు చెబుతున్నారు. ఏప్రిల్ రెండోవారంలో తొలి దశ పోలింగ్ ఉండొచ్చు. మే 18 లేదా 20వ తేదీ నాటికి పోలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుంది. అదే నెల చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

గడువు సమీపించిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్.. ఈ మధ్యాహ్నం దేశ రాజధానిలో అత్యున్నత సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించే 2,150 మంది ఐఎఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఏఏఎస్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల, ప్రవర్తన నియమావళిపై వారికి అవగాహన కల్పించింది ఈసీ.

ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తన నియామావళిని ఉల్లంఘించిన వారిపై కేసులను నమోదు చేయాలని ఆదేశించారు. డబ్బు, మద్యం పంపిణీపై దృష్టి సారించాలని సూచించారు. ఓటు హక్కు వినియోగంపై బూత్ స్థాయిలో ప్రజల్లో చైతన్యాన్ని కల్పించాలని అన్నారు.