TRINETHRAM NEWS


Ebrahim Raisi, the president of Iran, has died

ఇరాన్ అధ్యక్షుడు ఎబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ అధికారికంగా ప్రకటించింది. హెలీకాప్టర్ ప్రమాదంలో ధ్యక్షుడు ఎబ్రహీం రైసీ మృతి చెందినట్లు వెల్లడించింది. ఆదివారం సాయంత్రం హెలీకాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఆయన దుర్మరణం చెందారు.

ఇరాన్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతోపాటు ఆ దేశ విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమిరబ్‌ దొల్లాహియాన్‌ కూడా మృతి చెందారు. ఘటన జరిగిన 12 గంటల తర్వాత సోమవారం ఉదయం కూలిన హెలికాఫ్టర్‌ శిధిలాలను రెస్క్యూ టీం గుర్తించింది. ఘటనా స్థలంలో ఎవరూ బ్రతికి ఉన్న అనవాళ్లు కనిపించడం లేదని అక్కడి స్థానిక మీడియాలు వెల్లడిస్తున్నాయి.

హెలికాప్టర్ క్రాష్ సంఘటన ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు వాయువ్యంగా 600 కిలోమీటర్ల (375 మైళ్ళు) దూరంలో అజర్‌బైజాన్ దేశం సరిహద్దులో ఉన్న జోల్ఫా అనే నగరానికి సమీపంలో జరిగింది.

రైసీ పొరుగున ఉన్న అజర్‌బైజాన్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడి స్థానిక మీడియా కథనాల ప్రకారం.. హెలికాప్టర్‌లో అధ్యక్షుడితో సహా మొత్తం తొమ్మిది మంది వ్యక్తులు ఉన్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్ అబ్దోల్లాహియాన్, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలెక్ రహ్మతి, తబ్రిజ్ ఇమామ్ మొహమ్మద్ అలీ అలెహాషెమ్‌తోపాటు పైలట్, మరో కోపైలట్, క్రూ చీఫ్, ఇద్దరు భద్రత సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. ఆయన వెంట బయలుదేరిన మిగతా రెండు హెలికాఫ్టర్లు సురక్షితంగా ల్యాండయ్యాయి.

భారీ వర్షాలు, పొగమంచుతోపాటు తీవ్రమైన గాలి కారణంగా హెలికాప్టర్ కూలిపోయినట్లు తెలుస్తోంది. అయితే ‘హార్డ్ ల్యాండింగ్’ వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఆదివారం హెలికాఫ్టర్‌ మిస్‌ అయినప్పటి నుంచి త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు చేపట్టిన ‘ఇరాన్‌ రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ’ (IRCS) ఈరోజు ఉదయం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించింది. సోమవారం తెల్లవారుజామున కాలినడకన పిచ్-బ్లాక్ పర్వతప్రాంతంలో రెస్క్యూ టీం పరిశోధిస్తున్న సమయంలో హెలికాఫ్టర్‌ శిధిలాలను కనుగొన్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు హెలికాప్టర్ ప్రమాదంపై పలువురు గ్లోబల్ లీడర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాక్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, రష్యా, టర్కీ, యూరోపియన్ యూనియన్‌తో సహా పలు దేశాలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ebrahim Raisi, the president of Iran, has died