TRINETHRAM NEWS

Trinethram News : యాదగిరిగుట్ట

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ఆంక్షలతో టెంకాయ మొక్కు తీర్చుకోవాలంటే భక్తులకు తిప్పలు తప్పడం లేదు. క్యూలో కొబ్బరికాయతో వస్తున్న భక్తులను కాంప్లెక్స్‌ ప్రవేశం వద్దే ఆలయ సిబ్బంది నిలిపివేస్తున్నారు. వారిని విష్ణు పుష్కరిణి(గుండం) వద్ద ఆంజనేయస్వామి గుడి చెంత మొక్కు సమర్పించాలంటారు. కాదంటే టెంకాయ తీసుకుని దర్శనానికి పంపిస్తున్నారు. సరే అని ఒకరు కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్తే వెంటొచ్చిన వాళ్లను దర్శనానికి పంపిస్తున్నారు. సదరు భక్తుడు మొక్కు చెల్లించుకుని మళ్లీ వరుసలో ప్రారంభం నుంచి వచ్చి దర్శనం చేసుకుని తిరిగి తమ వారిని వెతుక్కుంటూ వెళ్లాల్సి వస్తోంది.
టెంకాయ మొక్కు గతంలో గర్భగుడిలోని స్వయంభువుల వద్దే సమర్పించేవారు. ఆ తర్వాత గర్భాలయం గడప దాటి ధ్వజస్తంభం ప్రాంగణానికి.. పడమటిరాజగోపురం ఎదుటకు చేర్చారు. క్షేత్రాభివృద్ధి తర్వాత ఈ మొక్కు తీర్చుకునేందుకు ప్రధానాలయం దరిదాపుల్లో కాకుండా ఆంజనేయస్వామి గుడి చెంత అవకాశం కల్పించారు. టెంకాయ మొక్కు ఎక్కడ తీర్చుకోవాలనే సూచికలూ ఏర్పాటు చేయకపోవడంతో క్యూలో వచ్చిన తర్వాత భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ఆలయ డిప్యూటీ ఈవో భాస్కరశర్మను వివరణ కోరగా ‘కొబ్బరి నీళ్లతో కృష్ణ శిల నేల దెబ్బ తింటుంది. డ్రైనేజీ పారుదలకు పీచు ఆటంకం కలిగిస్తుంది. దైవారాధనలు, దర్శనాలకు ఆటంకం ఏర్పడుతుందని టెంకాయ పక్కకు కొట్టించేందుకు చర్యలు తీసుకున్నాం’ అని చెప్పారు.