TRINETHRAM NEWS

Zilla Parishad High School, Raghavapur District Collector participated in the re-opening program after summer vacation

పెద్దపల్లి, జూన్ -12: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ప్రతిరోజూ పాఠశాలల్లో విద్యార్థులకు స్పోర్ట్స్ పీరియడ్, లైబ్రరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రధానోపాధ్యా యులకు తెలిపారు.

బుధవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా సందర్శించారు.

పాఠశాలకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ కు ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. పాఠశాలను ఆసాంతం పరిశీలించిన కలెక్టర్ అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా చేపట్టిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పాఠశాలలో న్యూట్రి గార్డెన్ ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా చూడాలని అన్నారు. పాఠశాల కిచెన్ షెడ్ ను పరిశీలించిన కలెక్టర్ మధ్యాహ్న భోజన కార్మికులు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకొని రావాలని అన్నారు. పాఠశాలకు వచ్చే బియ్యం నాణ్యతను పరిశీలించి తీసుకోవాలని, నాణ్యమైన బియ్యం రాని పక్షంలో వెంటనే తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.

పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అనుగుణంగా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, టాయిలెట్లలో టైల్స్ వేయాలని, వాటిని పకడ్బందీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. రాత్రి పూట పాఠశాల వద్ద ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని, దీనికి గ్రామ పెద్దల సహకారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ విద్యార్థులతో ముచ్చటించారు. సమ్మర్ హాలిడేస్ ఎలా గడిపారంటూ విద్యార్థులను ప్రశ్నించారు. మన జీవిత స్థాయిని, జీవన విధానాన్ని విద్య మాత్రమే మార్చగలుగు తుందని, మన పూర్వపు తరాల వారికి రాని అవకాశం మనందరికీ వచ్చిందని, మనకు అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ రోజూ చదువుకోవాలని కలెక్టర్ సూచించారు.

విద్యార్థులు పాఠశాలకు రెగ్యులర్ గా హాజరుకావాలని, చిన్నతనం నుంచి మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవాలని, బయట జంక్ ఫుడ్ తినవద్దని, ప్లాస్టిక్ వస్తువులలో ఇచ్చే ఆహారం ఎట్టి పరిస్థితుల్లోనూ తినవద్దని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.

పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని, జీవితంలో మొట్ట మొదటి పబ్లిక్ పరీక్షలు పదవ తరగతిలో ఎదుర్కొంటామని, మంచి మార్కులతో ప్రతి ఒక్క విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలని, టీచర్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినాలని, మన స్నేహితులు పాఠశాలకు రెగ్యులర్ గారాని పక్షంలో వారి వెంటపడి రెగ్యులర్ గా వచ్చేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.

పాఠశాలల్లో ఇకనుంచి ప్రతి రోజు స్పోర్ట్స్, లైబ్రరీ పీరియడ్ ఉండేలా చర్యలు తీసుకున్నామని, విద్యార్థులు ప్రతిరోజు కొంత సమయాన్ని క్రీడలు ఆడటానికి కేటాయించాలని, లైబ్రరీ పీరియడ్ సమయంలో మంచి పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గేటు లేదని, పాఠశాల ఆవరణలో పశువులు సంచరిస్తున్నాయని, గేటు ఏర్పాటు చేయాలని విద్యార్థి కోరగా, వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ గేటు ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకొని దానికి అవసరమైన 50 వేల రూపాయల చెక్కును కలెక్టర్ ప్రధానోపాధ్యాయులకు అందించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ పాఠశాలలోని విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్, పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు వి.హనుమంతు, పి.ఈ.టి సురేందర్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ జె.శ్రీవాణి, పంచాయతీ సెక్రెటరీ శ్రీధర్, ఎంపిఓ సుదర్శన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Zilla Parishad High School, Raghavapur District Collector participated in the re-opening program after summer vacation