District Collector Muzammil Khan should pay special attention to holistic development of every student
పెద్దపల్లి, జూన్ -11: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి సమగ్ర అభివృద్ధి చెందేలా ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యతోపాటు క్రీడలలో సైతం విద్యార్థులు రాణించేలా చూడాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో విద్యా సంవత్సరం ప్రారంభ మవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకోవాల్సిన చర్యలపై విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానో పాధ్యాయులు, వ్యాయమ ఉపాధ్యాయు లతో సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
బడిబాట కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాల గురించి వివరించాలని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో గతంలో కంటే కనీసం పది శాతం అదనంగా విద్యార్థుల ఎనరోల్మెంట్ పెరగాలని కలెక్టర్ సూచించారు.
ప్రతి గ్రామంలో పాఠశాలల్లో చేరిన విద్యార్థుల జాబితా నుంచి ప్రైవేటు పాఠశాలల్లో చేరిన విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రైవేటు పాఠశాలకు పంపడానికి గల కారణాలు తెలుసు కోవాలని, ఆ వివరాలతో ప్రత్యేకంగా నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
పాఠశాలలకు టీచర్స్, విద్యార్థుల హాజరు శాతంపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ హెడ్ మాస్టర్ లకు సూచించారు. పాఠశాలలకు ఉపాధ్యాయులు సకాలంలో హాజరు కావాలని, ప్రతిరోజు పాఠశాలలో టీచర్స్ హాజరుపై నివేదికను సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారికి సూచించారు.
పాఠశాలకు రెగ్యులర్ గా హాజరు కాని విద్యార్థులకు సంబంధించి జాబితా రూపొందించి వారు హాజరు కాకపోవడానికి గల సమస్యలు తెలుసుకొని, వీలైనంత వరకు పరిష్కరించి విద్యార్థుల హాజరు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రతి విద్యార్థి యొక్క విద్యా ప్రమాణాలు తెలుసుకునేందుకు బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలని అన్నారు.
విద్యార్థుల ప్రమాణాల ఆధారంగా వారిని 3 భాగాలుగా విభజించాలని, వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారికి పాఠ్యాంశాలు అర్ధమయ్యే విధంగా ప్రత్యేక విద్యా బోధన పద్ధతులను పాటించాలని కలెక్టర్ తెలిపారు.
విద్యతో పాటు క్రీడలలో సైతం విద్యార్థులను ప్రోత్సహించాలని, దీనికోసం ప్రత్యేకంగా మన జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి రోజు తప్పనిసరిగా ఒక స్పోర్ట్స్ పీరియడ్ ఏర్పాటు చేయాలని, దీనికి అవసరమైన సామాగ్రి, ఇతర ఏర్పాట్ల అంశంలో జిల్లా యంత్రాంగం నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పీఈటీ లకు కొన్ని పాఠశాలల బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని, పీఈటీ లు సదరు పాఠశాలల పరిధిలోని విద్యార్థుల హైట్, వెయిట్, ఫిట్ నెస్ అంశాలకు సంబంధించి ప్రాథమిక నివేదిక సిద్ధం చేయాలని, విద్యార్థులు రెగ్యులర్ గా క్రీడలు ఆడటం వారి శారీరక ఎదుగుదలకు, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని కలెక్టర్ తెలిపారు.
విద్యార్థులు రెగ్యులర్ గా స్పోర్ట్స్ ఆడటం వల్ల భవిష్యత్తులో జీవితంలో ఎదురయ్యే సమస్యలను, ఎత్తు పల్లాలను, జయాపజయాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారని అన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో రోజు విద్యార్థులు కొంత సమయం గ్రంధాలయంలో గడిపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ప్రతి పాఠశాలలో వారానికి ఒక రోజు యోగ పీరియడ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని, మధ్యాహ్న భోజన నాణ్యత అంశంలో ఎక్కడా ఎటువంటి రాజీ పడవద్దని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసే సన్న బియ్యం స్టాక్ నాణ్యతను పాఠశాలకు వచ్చినప్పుడే ప్రధానోపాధ్యాయులు చెక్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. స్థలం అందుబాటులో ఉన్న పాఠశాలల్లో న్యూట్రి గార్డెన్ ఏర్పాటు చేయాలని, పిల్లలకు మంచి పౌష్టికాహారం నాణ్యంగా, రుచిగా అందజేయాలని అన్నారు.
పాఠశాలల్లో న్యూట్రి గార్డెన్, కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు వ్యవసాయ శాఖ నుంచి అవసరమైన విత్తనాలు సరఫరా చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పాఠశాలలు పున: ప్రారంభం నుండి లంచ్ అండ్ లెర్న్ బుధవారం కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా నిర్వహించడం జరుగుతుందని, మధ్యాహ్నం భోజనం నాణ్యత అంశంలో ఎక్కడైనా చిన్న పోరపాటు జరిగినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.
రాబోయే విద్యా సంవత్సరంలో పేరెంట్, టీచర్స్ మీటింగ్ మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, ఈ మీటింగ్ లో ఉపాధ్యాయులు మరింత బాధ్యతా యుతంగా వ్యవహరించాలని అన్నారు. ప్రజలకు మనం జవాబుదారీతనంతో పని చేయాలని, విధులలో నిర్లక్ష్యం వహించే సిబ్బంది పట్ల ఇకనుంచి కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలో కల్పించిన వసతులపై ప్రధాన ఉపాధ్యాయుల నుంచి ఫీడ్ బాక్ తీసుకున్నారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, పాఠశాల అకాడమిక్ అధికారి పీఎం షేక్, ప్రధాన ఉపాధ్యాయులు, వ్యాయమ ఉపాద్యాయులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App