Trinethram News : సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక శైవ క్షేత్రాలలో జాతర వాతావరణం కనిపిస్తుంది. వేములవాడ రాజన్న, ఐనవోలు మల్లన్న, కొమురవెల్లి మల్లన్న, కందికొండ వీరభద్ర స్వామీ జాతర ఇలా వరుస జాతరలు సందడి చేస్తాయి.
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రానికి సమ్మక్క, సారలమ్మ భక్తులతోపాటు,మకర సంక్రాంతి పర్వదిన సందర్భంగా భక్తుల తాకిడి పెరిగింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. మేడారంలోని సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లే వారు ముందుగా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. దీంతో సమ్మక్క, సారలమ్మ లను దర్శించుకోవడానికి వెళ్లే భక్తులు స్వామి వారి దర్శనానికి పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. దీంతో రాజ రాజేశ్వర క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది.
దర్శనానికి క్యూలై న్లలో బారులు తీరారు. ఆలయ పరిసరాలు, ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు సందడిగా మారాయి. పార్కింగ్ స్థలం, ఆలయ పరిసర రహదారులు భక్తులు, వారి వాహనాలతో రద్దీగా మారాయి. స్వామి వారిని దర్శనానికి ప్రస్తుతం నాలుగు గంటల సమయం పడుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈరోజు సోమవారం కావడంతో మేడారం జాతరకు వెళ్లేవారు తొలిమొక్కు వేములవాడ రాజరాజేశ్వర స్వామికి చెల్లించడం మొదటి నుంచి ఆనవాయితీగా వస్తున్న క్రమంలో ఆలయానికి భక్తుల రద్దీ పెరిగినట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు .కళ్యాణకట్ట, ధర్మగుండం పరిసర ప్రాంతాలు కూడా దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
మొదట భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలను సమర్పించి, స్నానమాచరించి, స్వామివారికి కోడెమొక్కులను చెల్లించుకుంటున్నారు. ఆ తర్వాత వేములవాడ రాజన్నను దర్శించుకొని సమీపంలోని బద్దే పోచమ్మ అమ్మ వారికి బోనాలు సమర్పించడం కోసం బారులు తీరుతున్నారు. ఫిబ్రవరి నెలలో మేడారం జాతర కొనసాగనున్న నేపథ్యంలో వేములవాడలో భక్తజన సందోహం కొనసాగుతుంది.