Conferences and bus trip in districts from next week
ఆగస్ట్ లో హైదరాబాద్లో భారీ పబ్లిక్ మీటింగ్
బీసీ సంఘాల సమావేశంలో మేధావులు
Trinethram News : హైదరాబాద్: రాష్ట్రంలో కులగణన చేసి బీసీ రిజర్వేషన్ల వాటా తేల్చాకే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని బీసీ మేధావులు, వక్తలు డిమాండ్ చేశారు.
జులై నెలలో అలంపూర్ టూ హైదరాబాద్, ఆదిలాబాద్ టూ హైదరాబాద్కు బస్సుయాత్రలు చేస్తామని.. యాత్ర ముగిసిన తర్వాత హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
నేషనల్ ఓబీసీ కమిషన్ మాజీ చైర్మన్, జస్టిస్(రిటైర్డ్) ఈశ్వరయ్య మాట్లాడుతూ లోకల్ బాడీల్లో బీసీలు అధికారాన్ని చేజిక్కించుకొని చట్టసభలకు వెళ్లాలని అన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దు అనే జడ్జిమెంట్ తప్పు అన్నారు. తమిళనాడులో 69 శాతం, బీహార్‌లో 50 శాతానికిపైగా అమలవుతున్న విషయాన్ని గుర్తు చేశారు.
బీసీలంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికారం కోసం కొట్లాడాలని పిలుపునిచ్చారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై రిజర్వేషన్ల వాటాలపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తూనే ఉన్నాయని వివరించారు. ప్రభుత్వం తక్షణమే కులగణన కమిషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్లు పెంపులో.. న్యాయపరమైన చిక్కులు రాకుండా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
రిజర్వేషన్ల పెంపుపై గైడ్లైన్స్ఇవ్వాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మేధావులను చర్చలకు ఆహ్వానించి రిజర్వేషన్ల పెంపుపై గైడ్ లైన్స్ విడుదల చేయాలన్నారు. కులగణనపై ఏమాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించి.. చివరిగా బస్సు యాత్ర చేపట్టి లక్షల మందితో హైదరాబాద్ దిగ్బంధిస్తామని .. తర్వాత రాజకీయంగా జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్ రాములు మాట్లాడుతూ కులగణను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి 15 రోజులు సరిపోతుందని, నెలరోజులు పట్టినా కులగణన చేసి రిజర్వేషన్లు పెంచితేనే బీసీలకు రాజకీయంగా న్యాయం జరుగుతుందన్నారు. సమావేశంలో
ప్రొఫెసర్ సింహాద్రి, ప్రొఫెసర్ తిరుమలి, బీసీ సంఘాల నేతలు, ప్రొఫెసర్లు, రిటైర్డ్ అధికారులు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App