TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్: హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కొందరు అడ్డుపడుతున్నారని, అలాంటి వారికి నగర బహిష్కరణ తప్పదని సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు..

ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని బైరామల్‌గూడ జంక్షన్‌లో రూ.148.05 కోట్లతో నిర్మించిన లెవల్‌ -2 ఫ్లైఓవర్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు..

”కొడంగల్‌లో చేదు అనుభవం ఎదురైనా మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేశా. ఎల్బీనగర్‌ నియోజకవర్గం నాకు 30 వేల మెజార్టీ ఇచ్చి ప్రజా గొంతుకను చేసింది. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నా గుండె వేగం పెరుగుతుంది. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది నా బంధువులు, ఆత్మీయులే ఉన్నారు. హైదరాబాద్‌లో జనాభా పెరుగుతోంది. వారి అవసరాలకు తగ్గట్టు కృష్ణా జలాలు పెంచాం. మెట్రో రైలును విస్తరిస్తూ ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకూ తీసుకెళ్తాం. ఎల్బీనగర్‌ నుంచి శంషాబాద్‌ వరకు మెట్రో రాబోతోంది. పాతబస్తీ మెట్రోను ఆపాలని ఎవరో దిల్లీకి లేఖ రాశారంట. అభివృద్ధి పనులను అడ్డుకోవాలని చూస్తున్న వారికి నగర బహిష్కరణ తప్పదు.

మూసీ అభివృద్ధికి టెండర్లు పిలిచాం

మూసీ నది మురికి కూపంగా మారడంతో జనం అనారోగ్యాల బారిన పడుతున్నారు. హైదరాబాద్‌లో మూసీ కాలుష్యం నల్గొండ జిల్లాలోని 50 వేల ఎకరాలను కలుషితం చేస్తోంది. వైబ్రంట్‌ తెలంగాణ 2050కి ప్రణాళికలు తయారు చేస్తున్నాం. మూసీ అభివృద్ధికి టెండర్లు పిలిచాం, మాస్టర్‌ ప్లాన్‌ అందగానే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాం. ఔటర్‌ రింగురోడ్డు, విమానాశ్రయం కాంగ్రెస్‌ హయాంలోనే వచ్చాయి. వాటితో ఎన్నో కంపెనీలు రావడంతో తెలంగాణకు మంచి గుర్తింపు వచ్చింది. రాబోయే వందేళ్లు గొప్ప నగరంగా ఉండేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం. ఔటర్‌ రింగ్‌రోడ్డు లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలను హెచ్‌ఎండీఏ పరిధిలోకి తెస్తాం. భవిష్యత్‌లో నిర్మించే రీజినల్‌ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)తో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుంది” అని సీఎం తెలిపారు..