హైదరాబాద్: హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ప్రాంతాల్లో వాటిని నివారించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ఈ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ జాతీయ రహదారిపై రాష్ట్ర పరిధిలోని పెబ్బేరు, కనిమెట్ట, అమడబాకుల, తోమాలపల్లి వద్ద జంక్షన్లు ఉన్నాయి. ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు జాతీయ రహదారిని దాటడం ఒక్కటే మార్గం. ఈ నేపథ్యంలో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. అవసరమైన చర్యలు చేపట్టాలని కొన్నేళ్లుగా ప్రజలు గగ్గోలు పెడుతున్నా తాత్కాలిక చర్యలతోనే కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నెట్టుకొచ్చింది. నాలుగు వరుసలుగా ఉన్న ఈ మార్గాన్ని వచ్చే ఏడాదిలో 6 వరుసలకు విస్తరించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. అందుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తును కూడా పూర్తిచేసింది. భారత్‌మాల పరియోజన-2లో ఈ రహదారి విస్తరణను చేపట్టాలని నిర్ణయించింది. ఆలోగానే దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు గాను అధ్యయనం చేసింది.
పెబ్బేరు వద్ద ఫ్లైఓవర్..
ఈ మార్గంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న వనపర్తి జిల్లా పెబ్బేరు వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించింది. కొత్తకోట దాటిన తరవాత పెబ్బేరు పట్టణంలోకి వెళ్లేందుకు జాతీయ రహదారికి అనుసంధానంగా మార్గం ఒక్కటే అక్కడి ప్రజలకు ఆధారం. జాతీయ రహదారి మీదుగా వేగంగా వచ్చే వాహనాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చేపట్టిన అధ్యయనంలో ఫ్లైఓవర్ నిర్మాణం ఒక్కటే మార్గమని గుర్తించారు. అదే మార్గంలోని కనిమెట్ట, అమడబాకుల, తోమాలపల్లి వద్ద వెహికల్ అండర్‌పాస్ (వీయూపీ)లను నిర్మించనున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో ఈ జాతీయ రహదారి పరిధిలోనే ఆయా గ్రామాలు ఉన్నాయి. దీనిగుండానే ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించాల్సి ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రహదారికి ఇరువైపుల ఉన్న మార్గాలను కలుపుతూ వీయూపీలను నిర్మించాలని నిర్ణయించారు.
రూ.121 కోట్లతో..
ఫ్లైఓవర్, అండర్‌పాస్‌లను నిర్మించేందుకు రూ.121 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ మార్గాన్ని 6 వరుసలకు విస్తరించనున్న నేపథ్యంలో తదనుగుణంగా ఫ్లైఓవర్, అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 18 నెలల వ్యవధిలో ఈ నిర్మాణాలను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆయా నిర్మాణాల కోసం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ టెండర్లు ఆహ్వానించింది. ఎంపికైన గుత్తేదారు ఆయా నిర్మాణాలను అయిదేళ్లపాటు నిర్వహించాలనే నిబంధనను రూపొందించింది. టెండర్లు దాఖలు చేసేందుకు ఈ నెల 20వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు.