రాహుల్ గాంధీపై కేసు.. సీఐడీకి బదిలీ
Trinethram News : గువాహటి : కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ అస్సాంలో నిర్వహించిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే..
దీంతో రాహుల్ సహా ఇతర నేతలపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా దీన్ని సీఐడీ కి బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో సమగ్రమైన దర్యాప్తు కోసం కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్లు రాష్ట్ర డీజీ వెల్లడించారు..
ఇటీవల రాహుల్ యాత్ర గువాహటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా ఈ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ట్రాఫిక్ కారణాల దృష్ట్యా నగరంలో ఈ యాత్ర చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అందుకు బదులుగా బైపాస్ నుంచి వెళ్లాలని సూచించింది.
ఈ క్రమంలోనే యాత్ర నగరంలోకి ప్రవేశించకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుపెట్టారు. అయితే, కాంగ్రెస్ కార్యకర్తలు వాటిని తోసుకుని ముందుకు దూసుకెళ్లారు. దీంతో పోలీసులు, పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. సమూహాన్ని రాహుల్ రెచ్చగొట్టారని ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆదేశించారు.
యాత్ర పేరుతో అస్సాంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే కాంగ్రెస్ ఉద్దేశమని.. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీని అరెస్టు చేస్తామని సీఎం పేర్కొన్నారు..