TRINETHRAM NEWS

అంగన్‎వాడీల డిమాండ్లపై స్పష్టత ఇచ్చిన బొత్స.. కీలక అంశాలు వెల్లడి

బాలింతలు, గర్భిణీలు, పిల్లలకు పోషకాహారం అందించకుండా అంగన్వాడీ సెంటర్లు మూసేయడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. కాకాపోతే కాస్త సమయం పడుతుందన్నారు. మిగిలిన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. రాజకీయ పార్టీల ఉచ్చులో పడకుండా.. సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. తన మాటను వింటారని ఆశిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.

అంగన్‎వాడీలకు వేతనాలు రూ.26 వేలు అయినా ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. తెలంగాణలో కంటే అధికంగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. దీనిపై అధికారులతో సమీక్షలు జరుపుతున్నట్లు బోత్స వివరించారు. ఇప్పటికే అంగన్‎వాడీలతో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గ్రాడ్యూటీని రూ. 50 వేల నుంచి లక్ష రూపాలయలు చేస్తామని, హెల్పర్లకు రూ. 20 వేల నుంచి రూ. 40వేలు ఇస్తామని చెప్పినట్లు వెల్లడించారు.

అంగన్ వాడీలను మినీ సెంటర్ల నుంచి మెయిన్ సెంటర్లుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ పై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. స్థానికంగా ఉన్న జనాభా ప్రాతిపధికన సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేర సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అంశాలపై ముఖ్య కార్యదర్శులతో చర్చించి, సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.