Bail extension request is setback for Kejriwal
Trinethram News : దిల్లీ: తన మధ్యంతర బెయిల్ అంశంలో ఆమ్‌ఆద్మీపార్టీ(AAP) అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఊరట లభించలేదు. బెయిల్‌ను మరో ఏడురోజుల పాటు పొడిగించాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే..
అయితే పిటిషన్‌ను కోర్టు విచారించే అవకాశం లేదు. ఆ పిటిషన్ లిస్టింగ్‌కు సుప్రీం రిజిస్ట్రీ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టు వెళ్లేందుకు ఆయనకు స్వేచ్ఛ ఉందని, అందుకే ఈ పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని వెల్లడించింది..
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు.
దీంతో సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ ఇటీవల సుప్రీంను ఆశ్రయించారు. జూన్ 9న జైలుకు వెళ్లి లొంగిపోతానని పేర్కొన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App