Govt employees: ప్రైవేటు సంస్థల నుంచి అవార్డులు.. ఉద్యోగులకు కేంద్రం కొత్త రూల్స్
దిల్లీ: ప్రైవేటు సంస్థల (private organisations) నుంచి అవార్డులు (Awards) అందుకునే విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల (govt employees)కు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది..
వాటిని అంగీకరించే ముందు సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
”ప్రైవేటు సంస్థలు ఇచ్చే అవార్డులు స్వీకరించే ముందు.. ప్రభుత్వ ఉద్యోగులు సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి తీసుకోవాలి. సదరు ఉద్యోగి పనిచేస్తున్న మంత్రిత్వ శాఖ లేదా విభాగం సెక్రటరీ నుంచి ఈ అనుమతులు పొందాలి. ఇక ప్రభుత్వ కార్యదర్శులు, సెక్రటరీ ర్యాంక్ అధికారులు ఈ అవార్డులు స్వీకరించాలంటే.. కేబినెట్ సెక్రటరీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి” అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది..
అయితే, అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రైవేటు సంస్థల నుంచి అవార్డులు స్వీకరించేందుకు అధికారులు అనుమతులివ్వాలని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేగాక, ఈ అవార్డులు నగదు లేదా ఇతర సదుపాయాల రూపంలో ఉండకూడదని స్పష్టం చేసింది..
1964 నాటి కేంద్ర సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం.. ఏ ప్రభుత్వ ఉద్యోగి ప్రైవేటు వ్యక్తుల నుంచి అవార్డులు తీసుకోకూడదు. ఆ ఉద్యోగి గౌరవార్థం జరిగే ప్రైవేటు కార్యక్రమాలకు హాజరుకాకూడదు. అయితే, ఈ నిబంధనలను ఆ తర్వాత పలుమార్లు మార్చారు. చివరిసారిగా 2000 సంవత్సరంలో దీనిపై ఉత్తర్వులు జారీ చేస్తూ.. ”ప్రైవేటు సంస్థలు, ట్రస్ట్‌లు ఇచ్చే ద్రవ్య ప్రయోజనాల అవార్డులను తీసుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతి లేదు” అని స్పష్టం చేశారు. అయితే, ఈ నిబంధనలను ఉద్యోగులు సరిగా పాటించకపోవడంతో.. తాజాగా కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిని ఉద్యోగులంతా తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది..