TRINETHRAM NEWS

ఆ లెటర్స్ పట్టుకొస్తే చర్యలే..! పోలీస్ ఇన్‌స్పెక్టర్లకు CP శ్రీనివాస్ రెడ్డి స్వీట్ వార్నింగ్

హైదరాబాద్: పోలీసు శాఖలో కొంత మంది ఇన్ స్పెక్టర్లు తమ పోస్టింగుల విషయంలో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలపై సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.పోస్టింగ్‌ల కోసం సిఫార్సు లేఖలతో వస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్ పోలీస్ ఇన్ స్పెక్టర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

సిఫార్సు లేఖలు పట్టుకొచ్చే వారి పేర్లు ఏసీఆర్‌లో నమోదు చేస్తామని, ఒకసారి ఏసీఆర్‌లో పేరు నమోదు చేస్తే ప్రమోషన్లు ఉండవని హెచ్చరించారు. పోస్టింగుల విషయంలో రాజకీయాలు లేకుండా చూస్తామన్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తొలగ్గే ప్రసక్తే లేదన్న సీపీ.. టాలెంట్ ఉన్న సమర్థవంతమైన అధికారులను మాత్రమే విధుల్లో ఉంచుతామని స్పష్టం చేశారు. సిఫార్సు లేఖలు తెచ్చి సిబ్బంది పోస్టింగ్‌లు అడిగితే ఎవరికీ ఇవ్వబోమన్నారు.

సీపీ వ్యాఖ్యలతో డిపార్ట్మెంట్లో చర్చ:-

కాగా, ప్రమోషన్లు, పోస్టింగుల విషయంలో రాజకీయ జోక్యం పెరిగిపోతుందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కోరుకున్న స్థానాల్లో పోస్టింగ్ వచ్చేలా అధికారులు మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద క్యూ కడుతున్నారని, సిఫార్సు చేసేందుకు అవసరమైతే ఎంతో కొంత ముట్టజెప్పుకునేందుకు బేరసారాలు జరుపుతున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో పొలిటికల్ లీడర్ల నుంచి పైరవీలు ప్రమోషన్లు, బదిలీలలో పోలీస్ బాస్‌లకు తలనొప్పి వ్యవహారంగా మారుతున్నదన్న టాక్ వినిపిస్తోంది.

ఒకరి సిఫార్సు లేఖకు స్పందించి పోస్టింగ్ ఇస్తే అదే పోస్టింగ్ కోసం సిఫార్సు చేసిన మరొక ప్రజాప్రతినిధికి ఎక్కడ కోపం వస్తుందోనన్న ఆందోళన ఉన్నతాధికారులలో వ్యక్తం అవుతున్నది. దీంతో అసలైన సమర్ధులను అవసరం ఉన్నచోటకు బదిలీ చేయలేకపోతున్నారనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి పైరవీలు చెల్లవంటూ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇటీవలే సీపీగా బాధ్యతలు స్వీకరించిన కొత్తకోట.. పైరవీకారులను సహించేది లేదని వార్నింగ్ ఇవ్వడం డిపార్ట్ మెంట్‌లోనూ చర్చనీయాశంగా మారింది.