TRINETHRAM NEWS

Trinethram News : న్యూ ఢిల్లీ:-లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. CAAపై ఇవాళే రూల్స్(విధివిధానాలు) నోటిఫై చేయనున్నట్లు సమాచారం. మతపరమైన హింస కారణంగా 2014, డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు పౌరసత్వం తీసుకొచ్చేలా CAA తీసుకురాగా.. ముస్లింలకు మినహాయించడంపై వివాదం నెలకొంది.

కాగా, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే తీసుకువచ్చింది. అయితే కొన్ని ప్రాంతాలు, వర్గాల నుంచి వచ్చిన ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో సీఏఏ అమలును కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అయితే 2024 ఎన్నికలకు ముందే దేశంలో ఈ సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్-సీఏఏను అమలు చేయాలని మోడీ సర్కార్ తీవ్రంగా కసరత్తు చేసింది. ఈ క్రమంలోనే పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు దీనికి సంబంధించి.. కొంత సమాచారాన్ని కూడా ఇచ్చారు. అంతా ఊహించినట్లుగానే ఇవాళ రాత్రే దీనిపై విధివిధానాలు ఖరారు చేయనున్నారు.