భూగోళం లో మరో కొన్నిఏళ్ళలో చమురు నిల్వలు అంతం…నోరెండుతున్న ప్రపంచం.. ముందుంది మరింత గడ్డుకాలం!…నీటికీ కట కట లాడుతున్న కొన్ని దేశాలు..మనదేశం లో బెంగుళూరు?
భూగోళంపై మరికొన్నేళ్లలో చమురు నిల్వలు అంతం అయిపోతాయి..!
అందుకే ప్రపంచ దేశాలు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారిస్తున్నాయి.
అపారమైన సౌరశక్తి, పవన విద్యుత్తు, అణు ఇంధనం రూపంలో చమురుకు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి.
కానీ నీటికి ప్రత్యామ్నాయం ఏముంది?
యావత్ ప్రాణికోటికి నీరు ప్రాణాధారం. మానవ నాగరికతలు సైతం నిరంతరం నీటిని అందించిన నదీతీరాల వెంటనే విలసిల్లాయి.
కానీ ఆ నీరే ఇప్పుడు చమురు కంటే విలువైనదిగా మారిపోయింది.
ప్రపంచానికే సవాల్!
వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (WRI) అధ్యయనాల్లో బయటపడ్డ అంశాలు ప్రపంచంలో ఏవో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన సమస్య కాదు. ఇది యావత్ ప్రపంచానికే ఆందోళన కల్గించే అంశంగా పరిగణించాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు నీటి కొరత క్రమేణా పెరుగుతూ ప్రపంచ సమస్యగా మారుతోందని చెబుతున్నాయి. భారత్ విషయంలోనూ ప్రతికూల అంచనాలే కనిపిస్తున్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) గణాంకాల ప్రకారం దేశంలోని సగానికి పైగా రిజర్వాయర్లలో నీటి నిల్వలు వాటి సామర్థ్యం కంటే 40 శాతం దిగువకు పడిపోయాయి. రెండింట మూడొంతుల రిజర్వాయర్లలో వాటి సామర్థ్యం కంటే 50 శాతం దిగువకు చేరడంతో రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారతాయని అర్థమవుతోంది.
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం దేశంలోని 16.3 కోట్ల మంది ప్రజలకు సురక్షిత తాగు నీటిని అందుకోలేకపోతున్నారు. 21 కోట్ల మంది మెరుగైన పారిశుద్ధ్యాన్ని పొందలేకపోతున్నారు. సురక్షిత తాగునీరు లేకపోవడంతో నీటి ద్వారా అనేక సాంక్రిమిత వ్యాధులు విస్తరిస్తున్నాయి. వీటన్నింటికీ తోడు నదీతీరాల్లోని నగరాలు నదులను మురికి కూపాలుగా మార్చేసి నీటి వనరులను కాలుష్యంతో నింపేసి విషతుల్యంగా మార్చేస్తున్నాయి.
నీరు కేవలం తాగడానికి, వ్యవసాయానికి మాత్రమే కాదు, దేశ ఆర్థిక పురోగతిలో నీటి వనరుల లభ్యత అన్నదే అత్యంత కీలకాంశం. నీటి వనరులు లేని ఎడారి ప్రాంతాలకు, నీటి వనరులు పుష్కలంగా నదీతీర మైదాన ప్రాంతాలకు మధ్య తేడా గమనిస్తే ఇది స్పష్టమవుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో కారణం ఇదే
తెలుగు రాష్ట్రాలకు నీటిని అందించే రెండు ప్రధాన నదులు గోదావరి, కృష్ణ. వాటిలో నీటి ప్రవాహం నానాటికీ తగ్గిపోతుండగా.. భూగర్భ జలాలు ఇప్పటికే అడుగంటిపోయాయి. వ్యవసాయానికి ప్రభుత్వాలు అందిస్తున్న “ఉచిత విద్యుత్తు” పాపమే ఇదంతా అని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇష్టారాజ్యంగా భూగర్భ జలాలను తోడిపడేయడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని సూత్రీకరిస్తున్నారు. మోటార్ పంప్ సెట్‌లకు ఆటోమేటిక్ స్టార్టర్‌లను అమర్చి మరీ రాత్రీ, పగలు తేడా లేకుండా నీటిని తోడేయడం వల్ల తాగడానికి నీటిని వెతుక్కోవాల్సిన దుస్థితి తలెత్తింది. ఒకప్పుడు ఓ 50 అడుగుల లోతు కూడా లేని బావుల్లో నిండుగా నీరు కనిపించేది. ఇప్పుడు వందల కొద్దీ మీటర్ల లోతున బోరు బావులు తవ్వినా నీటి జాడ కనిపించడం లేదు. వరి వంటి అత్యధిక నీటి వినియోగం జరిగే పంటల సాగు ఎక్కువగా జరగడం కూడా మరో కారణం.
ప్రభుత్వాలు అందించే మద్దతు ధర కోసం రైతులు పంటల వైవిధ్యాన్ని వదిలేసి వరి సాగు చేస్తున్నారు. ఫలితంగా అందుబాటులో ఉన్న నీటి వనరులన్నీ వరి సాగుకే ఖర్చు చేయాల్సి వస్తోంది. వరి నిల్వలు అవసరానికి మించి పెరిగిపోయి, ఇతర పంటలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. నిపుణుల సూచన మేరకు వరి సాగును నీటి వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతాలకే పరిమితం చేసి, తక్కువ నీటిని వినియోగించే ఇతర ఆహార ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజల సాగు చేయాలని సూచిస్తున్నారు. నిపుణుల సూచనల సంగతెలా ఉన్నా.. నీటి కొరత ఏర్పడకుంటా ఉత్తమ నీటి నిర్వహణ పద్ధతులను అమలు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. అలాగే నీటి కొరతపై స్పృహ ప్రతి ఒక్కరికీ ఉండాలి. నీటిని పొదుపుగా వినియోగించుకోవడం అందరూ అలవర్చుకోవాలి. అప్పుడే భవిష్యత్తు తరాలకు మనం జలవనరులను మిగల్చగల్గుతాం.