జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Schools Reopen Today

50 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత బడిబాట పట్టనున్న విద్యార్థులు

కార్పొరేట్ లుక్లో మారిన ప్రభుత్వ విద్యార్థుల యూనిఫాం రంగులు

ఈ ఏడాది నుంచి బ్రేక్ ఫాస్ట్ స్కీమ్.. మొదటి రోజే పుస్తకాల పంపిణీ

Schools Reopen : త్రినేత్రం న్యూస్ : వేసవి సెలవుల సందడి ముగిసింది. సుమారు 50 రోజులకుపైగా ఆటపాటలతో హాయిగా గడిపిన చిన్నారులు మళ్లీ పుస్తకాల సంచులతో బడిబాట పట్టే సమయం ఆసన్నమైంది. సోమవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో ఇన్నాళ్లూ నిశ్శబ్దంగా ఉన్న పాఠశాల ప్రాంగణాలు మళ్లీ విద్యార్థుల కోలాహలంతో కళకళలాడనున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇప్పటికే స్టేషనరీ, బ్యాగుల కొనుగోళ్లతో బిజీగా ఉండటంతో నగరంలోని మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి.

ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల రూపం పూర్తిగా మారిపోనుంది. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా విద్యార్థులకు సరికొత్త యూని ఫాంను ప్రభుత్వం పరిచయం చేస్తోంది. గతంలో ఉన్న పాత రంగుల స్థానంలో ఆకర్షణీయమైన లైట్ బ్లూ షర్ట్ నేవీ బ్లూ ప్యాంట్ కాంబినేషనన్ను ఖరారు చేసింది. బాలురకు లైట్ బ్లూ షర్ట్, నేవీ బ్లూ ప్యాంట్, బాలికలకు లైట్ బ్లూ టాప్, నేవీ బ్లూ బాటమ్స్ (చూడీదార్, షర్ట్)తో పాటు నేవీ బ్లూ రంగు వెయిస్ట్ కోట్ ఇవ్వనున్నారు. గతంలో యూనిఫాంల రంగు వెలిసిపోవడం, నాణ్యత తక్కువగా ఉండటంపై వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. అత్యుత్తమ నాణ్యత కలిగిన బట్టలను ఎంపిక చేయడమే కాకుండా, రంగు వెలిసిపోకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ నెలాఖరులోపు విద్యార్థులందరికీ వీటిని పంపిణీ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ అధికారులను ఆదేశించారు.

మొదటి రోజే పుస్తకాల పంపిణీ.. కొత్తగా బ్రేక్ ఫాస్ట్ స్కీమ్….

విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచేలా ప్రభుత్వం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే పాఠశాలలకు చేరుకున్న పాఠ్యపుస్తకాలను మొదటి రోజే విద్యార్థులకు అందజేసేందుకు ఉపాధ్యాయులు సర్వం సిద్దం చేశారు. వీటికి తోడు, ఈ ఏడాది నుంచి బడుల్లో కొత్తగా బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ప్రారంభం కానుంది. ఉదయాన్నే పాఠశాలకు వచ్చే విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, ఏకాగ్రతను మెరుగుపరచడమే ఈ పథకం ఉద్దేశంగా ప్రభుత్వం భావిస్తోంది. సోమవారం బడులు తెరుచుకోనున్న నేపథ్యంలో విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పాఠశాలల శుభ్రత, తాగునీటి సౌకర్యం, మధ్యాహ్న భోజన ఏర్పాట్లపై ప్రత్యేకనిఘా ఉంచింది. కొత్తయూనిఫాంలు, కొత్త పుస్తకాలు, కొత్త పథకాలతో సర్కార్ బడులు విద్యార్థులకు సాదర స్వాగతం పలుకుతున్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page