Iron Fist on Fertilizer : రాష్ట్రంలో ఎరువుల అక్రమాలపై ఉక్కుపాదం

TRINETHRAM NEWS
Iron fist on fertilizer
  • వ్యవసాయేతర వినియోగం, బ్లాక్ మార్కెట్, అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్
  • రైతులకు అందాల్సిన ఎరువులను పక్కదారి పట్టిస్తే డీలర్ల లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
  • వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంపైనా విచారణ
  • ప్రత్యేక తనిఖీలు, విజిలెన్స్ నిఘా పెంపుకు ఆదేశాలు
  • జిల్లాల వారీగా ఎరువుల స్టాక్‌లపై రోజువారీ మానిటరింగ్
  • వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

Iron Fist on Fertilizer : అమ‌రావ‌తి, మే 20 : రాష్ట్రంలో రైతులకు అందాల్సిన ఎరువులను అక్రమంగా పక్కదారి పట్టించడం, వ్యవసాయేతర అవసరాలకు వినియోగించడం, బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలు, ఇతర ప్రాంతాలకు తరలింపు వంటి వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ఎలాంటి చర్యలనైనా ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు సరైన సమయంలో నాణ్యమైన ఎరువులు అందకుండా కొరత సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని మంత్రి ఘాటుగా హెచ్చరించారు. ఎరువులను అక్రమంగా నిల్వ చేయడం, ఇతర రాష్ట్రాలకు తరలించడం, పరిశ్రమలకు మళ్లించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడే డీలర్లు, మధ్యవర్తులు, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల డీలర్లు, గోదాములు, రవాణా కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ కమిషనర్ మంజీర్ జిలానీకి మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్, అనధికార విక్రయాలు, పరిశ్రమలకు, ఇతర అవసరాలకు ఎరువుల మళ్లింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. 2026-27 సంవత్సరంలో మే 4వ తేదీ నుండి ఇప్పటివరకు వ్యవసాయ శాఖ అమలు విభాగం చేపట్టిన కఠిన చర్యలను మంత్రి వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఎరువుల డీలర్లకు 182 షోకాజ్ నోటీసులు జారీ చేశారు, 80 ఎరువుల లైసెన్సులను సస్పెండ్ చేశారు, 1 ఎరువుల లైసెన్సును రద్దు చేశారు, సెక్షన్ 6-A కింద 1 కేసు నమోదు చేశారు, రూ.707 లక్షల విలువైన 3372 మెట్రిక్ టన్నుల ఎరువులను నిర్బంధించారు, రూ.5 లక్షల విలువైన 2 మెట్రిక్ టన్నుల ఎరువులను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

ఎరువులను అక్రమంగా నిల్వ చేయడం, రైతులకు అందకుండా ఇతర ప్రాంతాలకు తరలించడం, కృత్రిమ కొరత సృష్టించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఎరువులను పక్కదారి పట్టించినట్లు రుజువైతే సంబంధిత డీలర్ల లైసెన్సులు వెంటనే రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అంతేకాకుండా, ఈ వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వ్యవసాయ శాఖ అధికారులపైనా విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒకే జిల్లాలో సంబంధిత అధికారుల ప‌రిధిలో ఎరువుల అమ్మ‌కాల్లో పునరావృతంగా అవకతవకలు, నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూస్తే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే సంబంధిత అధికారులను తక్షణమే సస్పెండ్ చేసే అధికారాన్ని జిల్లా జాయింట్ డైరెక్టర్లకు (జేడీలు) అప్పగించినట్లు స్పష్టం చేశారు.

రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తుందని పేర్కొన్నారు. రైతులకు సరైన సమయంలో, సరిపడా పరిమాణంలో నాణ్యమైన ఎరువులు అందేలా జిల్లా వారీగా స్టాక్‌లపై రోజువారీ మానిటరింగ్ నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అక్రమ రవాణా, బ్లాక్ మార్కెట్ నియంత్రణ కోసం విజిలెన్స్ విభాగం, ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల నిఘాను మరింత పెంచుతున్నట్లు తెలిపారు. రైతులను మోసం చేసే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, రైతుల ప్రయోజనాల రక్షణే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top