TRINETHRAM NEWS

Trinethram News : అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటను హార్టీకల్చర్‌ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. స్థానిక పామాయిల్ పరిశ్రమను సోమవారం ఆయన సందర్శించారు. రూ.30 కోట్లతో బయోవిద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతో సంస్థపై కరెంటు భారం కొంతవరకు తగ్గుతుందన్నారు. మే నెల లోపు నిర్మాణాన్ని పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ ప్రాంతం కొబ్బరి, జాజి, మిరియాలు, వక్క తదితర పంటలకు చాలా అనువుగా ఉందని, రైతులకు ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారాన్ని అందిస్తామని చెప్పారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు అనుబంధంగా ఉద్యాన తరగతుల ఏర్పాటుకై త్వరలోనే వీసీతో చర్చిస్తానన్నారు. దివంగత నేత ఎన్టీఆర్ చొరవతో ఆయిల్ ఫామ్ సాగుకు బీజం పడిందన్నారు. మంత్రి తుమ్మల వెంట ఆయిల్ ఫెడ్ జీఎం సుధాకర్‌రెడ్డి, రైతు నాయకులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్‌, ఆలపాటి రామ్మోహన రావు, బండి భాస్కరరావు తదితరులు ఉన్నారు.