Increase IPS Officers : రాష్ట్రంలో IPS ల సంఖ్యను 105 కు పెంచండి

TRINETHRAM NEWS
  • పెరుగుతున్న జనాభా, హైదరాబాద్ విస్తరణతో తెలంగాణకు మరింత మంది ఐపీఎస్ లు అవసరం
  • వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వండి
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి
  • మావోయిస్టుల అంశంపై నివేదిక అందజేసిన ముఖ్యమంత్రి
  • తెలంగాణ పోలీసులను అభినందించిన అమిత్‌ షా
  • ఈగల్‌ టీమ్‌ను మరింత బలోపేతం చేయాలని సూచన

Trinethram News : న్యూఢిల్లీ/హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్‌లను కేటాయించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. పెరిగిపోతున్న సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌, వైట్‌ కాలర్‌ నేరాలను అరికట్టడం, శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌, పెరుగుతున్న జనాభా, హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, కొత్తగా ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ ఏర్పాటు నేపథ్యంలో తెలంగాణకు మరింత మంది ఐపీఎస్‌ అధికారులు అవసరమని వివరించారు. బుధవారం ఢిల్లీలో అమిత్‌ షాతో ఆయన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ శివధర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీపీ విజయ్‌కుమార్‌, ఎస్‌ఐబీ ఐజీపీ బి.సుమతి సుమారు గంటన్నర పాటు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు కీలక భద్రతా అంశాలు, పోలీస్‌ విభాగం బలోపేతం, మావోయిస్టుల అంశంపై చర్చించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2016లో మొదటిసారి ఐపీఎస్‌ క్యాడర్‌ రివ్యూ జరిగిందని, 2021లో జరగాల్సిన రివ్యూ ఆలస్యంగా 2025లో జరిగిందని.. ఆ సమయంలోనూ ఏడుగురు ఐపీఎస్‌లను మాత్రమే తెలంగాణకు కేటాయించారని అమిత్‌ షాకు సీఎం వివరించారు. మూడో క్యాడర్‌ రివ్యూను నిర్దేశిత సంవత్సరమైన 2026లోనే చేపట్టాలన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో 83 ఐపీఎస్‌ అధికారులు ఉన్నారని.. వారి సంఖ్యను 105కు పెంచాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను కేంద్ర మంత్రి దృష్టికి సీఎం రేవంత్‌ తీసుకెళ్లారు. ముఖ్యంగా ఈగల్‌ ఫోర్స్‌ కార్యకలాపాలు, సైబర్‌ నేరాలు, సైబర్‌ సవాళ్లను ఎదుర్కోవడంలో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోషిస్తున్న క్రియాశీలక పాత్రను వివరించారు. ఇక వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి అందాల్సిన సాయంపైనా చర్చ జరిగింది. ఈ మేరకు నిధులు ఇవ్వాలని అమిత్‌ షాను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.

  • మావోయిస్టుల అంశంపై సుదీర్ఘ చర్చ

రాష్ట్రంలో మావోయిస్టుల అంశం, ప్రభుత్వం అనుసరించిన వ్యూహాలు, దక్కిన ఫలితాలు, మావోయిస్టుల లొంగుబాటు, పునరావాసం తదితర అంశాలపైనా అమిత్‌ షాకు రేవంత్‌రెడ్డి నివేదికను అందజేశారు. రాష్ట్రంలో గత రెండేళ్లలో గణనీయమైన మార్పులు వచ్చాయని, 591 మంది మావోయిస్టులు లొంగిపోయారని.. ఇది మంచి పరిణామమని అమిత్‌ షాకు సీఎం, పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. తెలంగాణ నుంచి మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నది కేవలం 11 మందేనని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. లొంగిపోయిన మావోయిస్టులు వెల్లడించిన భవిష్యత్‌ కార్యాచరణ వివరాలను అందజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులను కేంద్ర మంత్రి అమిత్‌షా అభినందించారు. ఆపరేషన్‌ కగార్‌కు మంచి సహకారం అందించారని, ఆపరేషన్‌ పూర్తయ్యే వరకు ఇలాగే కొనసాగాలని, మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయేలా చూడాలని చెప్పారు. తెలంగాణలో ఈగిల్‌ టీమ్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఇక తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ తదితర మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల పోలీసులు, నాయకులు కూడా కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Increase the number of IPS officers

You cannot copy content of this page

Scroll to Top