Baburam Naik : 186 రోజుల ఆర్ టీ ఐ నిర్లక్ష్యంపై రాష్ట్ర సమాచార కమిషన్ కఠిన చర్యలు.

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 06 త్రినేత్రం న్యూస్. రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు బాబురామ్ నాయక్ దాఖలు చేసిన రెండు ఆర్ టీ ఐ దరఖాస్తులకు సంబంధించి 186 రోజుల పాటు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన ఘటనపై రాష్ట్ర సమాచార కమిషన్ తీవ్రంగా స్పందించి, సంబంధిత ప్రజా సమాచార అధికారులకు సమాచారం అందించేందుకు ఏడు రోజుల చివరి గడువు విధిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులకు సంబంధించి రెండు కీలక అంశాలు విచారణకు వచ్చాయని తెలిపారు. మొదటగా, మల్లెపల్లి (కొండమల్లేపల్లి), ధనియాల గ్రామం పరిధిలో ఉన్న సుమారు 33 ఎకరాల ప్రభుత్వ బంజరు భూమిని 1950 సంవత్సరం నుంచి వ్యక్తిగత భూమిగా అక్రమంగా మార్చినట్లు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఈ అక్రమ మార్పుకు సంబంధించిన భూ రికార్డులు, మార్పుల ఆధారాలు, అనుమతులు, దస్తావేజులను ఆర్ టీ ఐ చట్టం ద్వారా కోరినప్పటికీ, అధికారుల నుంచి ఎలాంటి సమాచారం అందించకపోయిన విషయం కమిషన్ పరిశీలనలోకి వచ్చినట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా, నల్లగొండ జిల్లా డిఆర్డీఓ / డిఆర్డీఏ అధికారిపై నిధుల దుర్వినియోగం, నియామకాలలో అక్రమాలు, గృహ నిర్మాణ పథకాలు మరియు నీటి సరఫరా పథకాల అమలులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని ఆయన తెలిపారు. దీనితో పాటు, సంబంధిత అధికారి సర్వీస్ బుక్‌కు సంబంధించిన వివరాలు కూడా ఆర్ టీ ఐ ద్వారా కోరినప్పటికీ, అవి వ్యక్తిగత అంశాలంటూ చెప్పి పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వకుండా తప్పించుకున్న విషయం కూడా కమిషన్ దృష్టికి వచ్చినట్లు స్పష్టం చేశారు.
ఆర్ టి ఐ చట్టం – 2005 ప్రకారం ఏ దరఖాస్తుకైనా 30 రోజులలోపు సమాధానం ఇవ్వడం తప్పనిసరి అయినప్పటికీ, ఈ రెండు దరఖాస్తులకు సంబంధించి 186 రోజుల ఆలస్యం చేయడం చట్టానికి తీవ్రమైన ఉల్లంఘనగా రాష్ట్ర సమాచార కమిషన్ నిర్ధారించింది.
ఈ వ్యవహారంపై స్పందించిన రాష్ట్ర సమాచార కమిషనర్, ఈ రెండు కేసులలోనూ సంబంధిత ప్రజా సమాచార అధికారులకు ఏడు రోజులలోపు పూర్తి, సరైన మరియు స్పష్టమైన సమాచారం అభ్యర్థికి అందజేయాలని ఆదేశాలు పాస్ చేస్తూ, ఇకపై వ్యక్తిగత అంశాల పేరుతో సమాచారం దాచే ప్రయత్నాలు చేస్తే చట్టపరమైన పరిణామాలు తప్పవని కఠిన హెచ్చరిక జారీ చేశారు, అలాగే విధించిన ఏడు రోజుల గడువు ముగిసేలోపు కమిషన్ ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని, గడువు దాటినట్లయితే ఈ వ్యవహారం మరింత తీవ్రమైన న్యాయ చర్యల దిశగా వెళ్లడం అనివార్యమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా బాబురామ్ నాయక్ మాట్లాడుతూ, 186 రోజుల నిర్లక్ష్యం ప్రభుత్వ పారదర్శకతపై జరిగిన తీవ్రమైన దాడి అని, విధించిన ఏడు రోజుల గడువు చివరి హెచ్చరిక మాత్రమేనని, ఈ కాలపరిమితిలో సమాచారం అందించకపోతే రాష్ట్ర సమాచార కమిషన్‌లో తదుపరి చర్యలతో పాటు హైకోర్టును ఆశ్రయించి కచ్చితమైన చట్టపరమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని, ప్రజల హక్కులు మరియు పారదర్శక పరిపాలన కోసం ఈ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

State Information Commission takes strict action

You cannot copy content of this page

Scroll to Top