1132 మందికి పోలీసు పతకాలు.. తెలంగాణకు 20, ఏపీకి 9
Trinethram News : దిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ (MHA).. పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు పతకాల (Police Medals)ను ప్రకటించింది..
దేశవ్యాప్తంగా 1132 మందికి గ్యాలంట్రీ/సర్వీసు పతకాలు అందజేయనుంది. ఈ మేరకు గురువారం అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 275 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, 102 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 753 మందికి పోలీస్ విశిష్ఠ సేవా (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పతకాలను ప్రకటించింది.
గ్యాలంట్రీ పతకాలు దక్కించుకున్న 277 మందిలో అత్యధికంగా జమ్మూకశ్మీర్ నుంచి 72 మంది పోలీసులు, ఛత్తీస్‌గఢ్ నుంచి 26, ఝార్ఖండ్ నుంచి 23, మహారాష్ట్ర నుంచి 18 మంది ఉన్నారు. సీఆర్పీఎఫ్‌నుంచి 65, సశస్త్ర సీమాబల్ నుంచి 21 మంది ఈ పతకాలు అందుకోనున్నారు. లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న 119 మంది, జమ్మూకశ్మీర్‌లో పనిచేస్తున్న 133 మందికి ఈ మెడల్స్ దక్కాయి.
తెలుగు రాష్ట్రాల వారికి ఇలా..
ఈ పురస్కారాల్లో తెలంగాణ నుంచి 20, ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మందికి పతకాలు దక్కాయి. ఏపీలో 9 మందికి పోలీసు విశిష్ఠ సేవా పతకాలు ఇవ్వనున్నారు. తెలంగాణ నుంచి ఆరుగురు మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇద్దరు రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 12 మంది పోలీసు విశిష్ఠ సేవా పతకాలు అందుకోనున్నారు. తెలంగాణ అదనపు డీజీపీలు సౌమ్యా మిశ్రా, దేవేంద్ర సింగ్ చౌహాన్‌కు రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి.
స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ఏటా రెండు సార్లు ఈ పోలీసు పతకాలను ప్రకటిస్తుంది.