ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల్లోని సీనియర్ నాయకులు యాక్టివ్ అవుతున్నారు. గత రెండు ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కాస్త పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో హస్తం పార్టీ నేతలు ఉత్సాహంగా ఉన్నారు. సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల రాకతో జోష్ మరింత పెరిగింది. అటు అధిష్టానం కూడా ఏపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాపులకు ఇదే మంచి అవకాశం
మెగాస్టార్ చిరంజీవి మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని, తిరుపతి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని చింతామోహన్ అన్నారు. శనివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చిరంజీవి పోటీ చేస్తే 50 వేల మెజార్టీతో గెలిపిస్తామన్నారు. చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేస్తే సీఎం కావడం ఖాయమని, పోటీకి దిగాలా వద్ద అన్న నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనే అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి సీఎం కావాలని కోరుకుంటున్న కాపులకు ఇదే మంచి అవకాశమని చెప్పారు.
కాకినాడలో ఏచూరి, నగరిలో నారాయణ పోటీ చేయాలి
ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని.. 130 అసెంబ్లీ, 20 లోక్ సభ స్థానాల్లో తమ పార్టీ గెలవబోతోందని జోస్యం చెప్పారు. ఏపీలో ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉండదని, ఇండియా కూటమి లో ఉన్న పార్టీలతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తుందన్నారు. కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి సీతారాం ఏచూరి, నగరి అసెంబ్లీ నుంచి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పోటీ చేయాలని కోరుతున్నట్టు చింతామోహన్ వెల్లడించారు.
కాగా, చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్రమంత్రి పదవి దక్కించుకున్నారు. 2017లో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుని మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వశిష్ట్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గతేడాది ఆయన నటించిన వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు విడులయ్యాయి. అయితే మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని పలు సందర్భాల్లో చిరంజీవి స్సష్టం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుంటారా, లేదా అనేది వేచి చూడాలి.