TRINETHRAM NEWS

‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’లో తెలంగాణకు అవార్డుల పంట

జాతీయ స్థాయిలో నాలుగు పురస్కారాలు

Trinethram News : హైదరాబాద్‌: పారిశుద్ధ్య నిర్వహణలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో పలు అవార్డులు దక్కాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌, గార్బేజ్‌ ఫ్రీ సిటీ విభాగాల్లో తెలంగాణలోని 20 పురపాలికలు 22 పురస్కారాలు సాధించాయి. ఏటా కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా వివిధ ప్రమాణాల మేరకు ఈ అవార్డులను ఇస్తుంది. 2023-24 సంవత్సరానికి గాను శుభ్రమైన నగరాల (క్లీనెస్ట్‌ సిటీస్‌) విభాగంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ దేశంలో తొమ్మిదో స్థానంలో నిలవడంతో పాటు ఫైవ్‌స్టార్‌ సర్టిఫికెట్‌ను పొందింది. గుండ్లపోచంపల్లి, నిజాంపేట, సిద్దిపేట మున్సిపాలిటీలు సైతం జాతీయస్థాయిలో అవార్డులు గెలుచుకున్నాయి. జోనల్‌ స్థాయిలో నిజాంపేట, సిద్దిపేటలతో పాటు పీర్జాదిగూడ, నార్సింగి, ఇబ్రహీంపట్నం, శంషాబాద్‌, నాగారం, తుర్కయంజాల్‌, బొల్లారం, అయిజ, అమీన్‌పూర్‌, బోడుప్పల్‌, బండ్లగూడజాగీర్‌, మేడ్చల్‌, దుబ్బాక, ఇల్లెందు, హుజూరాబాద్‌, ఆర్మూర్‌ పురపాలికలు గుర్తింపు పత్రాలను పొందాయి. గురువారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయా అవార్డులను కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ అందజేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌రాస్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.