CM Revanth Reddy : ఎమ్మార్ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ(గురువారం) సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ఎమ్మార్ ప్రతినిధుల సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో ఎమ్మార్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ అలబ్బర్, భారత్‌లో యూఏఈ మాజీ రాయబారి డాక్టర్ అహ్మద్ అల్ బన్నా, ఎమ్మార్ గ్రూప్ సీఈవో అమిత్ జైన్, ఆ కంపెనీ ఇంటర్నేషనల్ అఫైర్స్ హెడ్ ముస్తఫా అక్రమ్ పాల్గొన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి హాజరయ్యారు. వివిధ కేసులతో పెండింగ్‌లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ ప్రతినిధులు కోరారు.

2001లో ఉమ్మడి రాష్ట్రంలో దుబాయికు చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ హైదరాబాద్‌లో కన్వెన్షన్ సెంటర్, హోటల్, గోల్ఫ్ కోర్సు, విల్లాలు తదితర ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు అప్పటి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుందని గుర్తుచేశారు. ఏపీఐఐసీతో ఆ సంస్థ చేసుకున్న ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని అప్పట్లో సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఏజెన్సీల దర్యాప్తులు, కోర్టుల్లో విచారణలు కొనసాగుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2015 అక్టోబర్‌లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు సంబంధించిన ప్రాజెక్టుల వివాదాల పరిష్కారానికి ఛీప్ సెక్రెటరీ సారధ్యంలో అయిదుగురు సెక్రెటరీల కమిటీని ఏర్పాటు చేసిందని వివరించారు.

మరోవైపు కేంద్ర విదేశాంగ శాఖ, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఎమ్మార్ ప్రతినిధులతో జరిగిన చర్చల సందర్భంగా ఈ అంశాలన్నింటినీ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. వివిధ దర్యాప్తు ఏజెన్సీల కేసులు, ఛార్జీ షీట్లు, న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున ఎమ్మార్ ఒప్పందాల డాక్యుమెంట్లు, కోర్టు కేసుల వివరాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సూచనలన్నీ క్షుణ్నంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు 2015లో చీఫ్ సెక్రటరీ నేత్రుత్వంలో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి అదనంగా న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. న్యాయ వివాదాలను అధ్యయనం చేయడానికి, సామరస్య పూర్వక పరిష్కారం చేసుకోవడానికి యూఏఈ ప్రభుత్వ ఆమోదంతో ఒక లీగల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు ప్రతిపాదించగా, వారి ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమోదించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ వారితో సంప్రదింపులు జరిపి తదుపరి సూచనలు, సలహాలు అందిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Revanth Reddy met Emaar

You cannot copy content of this page

Scroll to Top