TRINETHRAM NEWS

Trinethram News : 6th Jan 2024

ఏపీలో ఈసీఐ పర్యటన ఖరారు.. తొలి విడతలోనే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు..

ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసుకునే విషయంలో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అయితే మరిన్ని రోజులు పర్యటనలు చేసి, ఇంకొందరిని సంప్రదించి షెడ్యూల్ ను విడుదల చేస్తామని ప్రకటించింది ఈసీ.
ఈ క్రమంలోనే ఏపీలో ఎన్నికలు మొదటి దశలోనే ముగించేలా ప్రణాళికలు రచిస్తోంది.

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటూ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభతో పాటు, తమిళనాడు లోక్ సభకు తొలి దశలోనే ఎన్నికలు పూర్తి చేయాలని యోచిస్తోంది. జనవరి 7 నుంచి లోక్ సభ ఎన్నికల నిర్వహణ కోసం ముందుగా తమిళనాడులో పర్యటించనుంది. అక్కడి 39 లోక్ సభ స్థానాలకు సంబంధించిన పోలింగ్ నిర్వహణపై ఉన్నతాధికారులతో భేటీ అవనున్నారు. ఆ తరువాత జనవరి 9,10 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‎లో పర్యటించనున్నారు.

జిల్లా స్థాయి అధికారులతోపాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని శాఖల అధికారులతో సంప్రదింపులు జరుపుతారు. అలాగే ఓటర్ల జాబితాలోని లోపాలను, ఇప్పటికే సిద్దమైన ముసాయిదాలోని లోపాలను పరిశీలించనున్నారు.

జనవరి చివరి వారానికి తుది ఓటర్ల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు గతంతో నిర్వహించినట్లుగా తొలిదశలోనే ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. 2019లో ఏప్రిల్ 11న ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ మే 19తో ముగిసింది.

ఇందులో దేశ వ్యాప్తంగా లోక్ సభ, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినట్లు తెలిపింది ఎన్నికల సంఘం. ఈసారి దేశ వ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికలను ఆరు లేదా ఏడు విడతల్లో నిర్వహించాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా కార్యచరణను రూపొందించి ముందుకు సాగుతోంది.