TRINETHRAM NEWS

చైనాలో కొత్త వైరస్ కలకలం.. భారీగా ఆసుపత్రులకి చేరుతున్న ప్రజలు..అసలేంటి ఈ వైరస్..!!

Trinethram News : China : కోవిడ్ భయాలు ఇంకా పూర్తిగా తొలగకముందే, చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. అదే హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (HMPV). కరోనాతో సతమతమైన డ్రాగన్ కంట్రీ, ఇప్పుడు ఈ కొత్త వైరస్‌తో భయపడుతోంది.

ఆసుపత్రులు కిక్కిరిసిపోవడం, శ్మశాన వాటికల వద్ద రద్దీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2001లో కనుగొన్న ఈ వైరస్, అన్ని వయసుల వారికీ సోకుతుంది, కానీ పిల్లలు, వృద్ధులు, బలహీన రోగనిరోధక శక్తి కలిగిన వారికి మాత్రం చాలా ప్రమాదకరం. మరి ఇది కోవిడ్ మాదిరిగా మరో మహమ్మారిలా మారుతుందా? దీని లక్షణాలు, నివారణ చర్యలు, ఇతర వివరాలన్నీ తెలుసుకుందాం.

HMPV సోకితే జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు బ్రాంకైటిస్ లేదా న్యుమోనియా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకరి నుంచి మరొకరికి చాలా సులభంగా వ్యాప్తి చెందుతుంది. ఇన్‌ఫెక్షన్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ గాలిలో కలిసి ఇతరులకు వ్యాపిస్తుంది. అంతేకాదు, వైరస్ ఉన్న వస్తువులను తాకి, ఆ చేతులతో ముక్కు, నోరు, కళ్లను తాకినా వైరస్ సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చలికాలంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.

ఈ HMPV రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) కుటుంబానికి చెందినది. HMPVకి ప్రత్యేక చికిత్స లేదు. లక్షణాలను బట్టి డాక్టర్లు ట్రీట్‌మెంట్ చేస్తారు. కాబట్టి, వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తరచుగా చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, జలుబు, దగ్గు ఉన్నవారికి దూరంగా ఉండటం తప్పనిసరి. మాస్క్‌లు ధరించడం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా కూడా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. పిల్లలకు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం అవసరం. ఒకవేళ మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

HMPV లక్షణాలు సాధారణ జలుబు, ఫ్లూ వంటి ఇతర శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్లాగే ఉంటాయని చెబుతున్నారు. కానీ టెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, HMPV కారణంగా ఆకస్మిక మరణాలు పెరుగుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా 40 నుంచి 80 ఏళ్ల వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో పోస్టుల ప్రకారం, చైనాలో ఇప్పుడు ఒకేసారి అనేక వైరస్‌లు విజృంభిస్తున్నాయి. ఇన్‌ఫ్లుఎంజా A, HMPV, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్-19 వంటి వైరస్‌లు ఒకేసారి వ్యాప్తి చెందడంతో ఆసుపత్రులు, శ్మశాన వాటికలు రోగుల తాకిడిని తట్టుకోలేకపోతున్నాయి. పిల్లల ఆసుపత్రుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. న్యుమోనియా కేసులు, ముఖ్యంగా “వైట్ లంగ్” కేసులు విపరీతంగా పెరగడంతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి.

14 ఏళ్లలోపు పిల్లలు ఈ వైరస్ బారిన పడుతుండటం మరింత కలవరపెడుతోంది. చైనా CDC నివేదికల ప్రకారం, ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. డాక్టర్ లి టోంగ్‌జెంగ్ చెప్పినట్లు, HMPV తుంపర్లు, ప్రత్యక్ష స్పర్శ, కలుషిత ఉపరితలాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకిన 3-5 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ ఉన్న వస్తువులను తాకి, ఆ చేతులతో ముక్కు, నోరు, కళ్లను తాకినా వైరస్ సోకే ప్రమాదం ఉంది. పిల్లలు ఒకరికొకరు దగ్గరగా ఉండటం వల్ల వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

భయపడాలా?

HMPV వేగంగా వ్యాప్తి చెందుతున్నా, దీనికి ప్రత్యేక మందులు లేవు. ఇది సాధారణ జలుబు లాంటిదే. అందుకే, సొంత వైద్యం వద్దు. డాక్టర్ సలహా లేకుండా యాంటీవైరల్స్ వాడొద్దు. జ్వరం, ఒళ్లు నొప్పులకు పారాసిటమాల్ వాడొచ్చు. దగ్గు, జలుబుకు సాధారణ మందులు పనిచేస్తాయి. కానీ, లక్షణాలు తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్‌ని కలవడం తప్పనిసరి. భయపడాల్సిన పనిలేదు, కానీ జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.

HMPV మొదట చైనాలో కనిపించినా, ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది. ఇది ఒక గ్లోబల్ ముప్పు. అందుకే, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం చాలా ముఖ్యం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App