గ్రామాల్లోకి వీఆర్వోలు.. పాతవారికి మళ్లీ పిలుపు..!!
వీఆర్వోల నియామక ప్రక్రియ షురూ
పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల నుంచి ఆప్షన్లు
సర్వేయర్ల నియామకంపైనా దృష్టి
కొత్త వ్యవస్థ సర్వీస్ రూల్స్‌పై అస్పష్టత
తర్జనభర్జన పడుతున్న ఉద్యోగులు
Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 24 : గ్రామాల్లోకి మళ్లీ వీఆర్వోలు రానున్నారు. ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన భూ భారతి బిల్లులలో కొత్తగా గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారులను నియమించనున్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం మళ్లీ వీఆర్వో వ్యసస్థను అమలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రామాల్లో పనిచేసేందుకు రెవెన్యూ అధికారుల నియామకానికి కసరత్తు మొదలుపెట్టింది. సర్వేయర్ల నియామకంపైనా దృష్టి పెట్టింది. గతంలో వీఆర్వోలు, వీఆర్‌ఏలుగా పనిచేసి ఇతర శాఖల్లోకి బదిలీ అయినవారి నుంచి ఆప్షన్లు స్వీకరిస్తున్నది. ఈ మేరకు తాజాగా సీసీఎల్‌ఏ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీచేశారు. గూగుల్ ఫామ్స్‌లో వివరాలు నింపాలని, జిల్లాల వారీగా కలెక్టర్లు వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఈ నెల 28వ తేదీలోగా వివరాలు అందజేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీజీఆర్‌ఎస్‌ఏ) హర్షం వ్యక్తంచేసింది. సంఘం అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి, కార్యదర్శి వీ భిక్షం రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త అధికారుల రాకతో రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏం పని.. ఎంత జీతం?
గ్రామస్థాయి రెవెన్యూ అధికారులుగా వెళ్లాలో వద్దో తేల్చుకోలేక, పూర్వ వీఆర్‌ఏలు, వీఆర్వోలు మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో ఉన్న వీఆర్వో వ్యవస్థ రద్దయిన నేపథ్యంలో కొత్త పోస్టుల నియమ నిబంధనలను ప్రభుత్వం ఇంకా వెలువరించలేదు. వెళ్తే ఏ పనిచేయాలి? హోదా, వేతన స్కేలు వంటివి ఇంకా ఖరారు చేయలేదు. దీంతోపాటు వీఆర్‌వో, వీఆర్‌ఏ వ్యవస్థ రద్దయినప్పటినుంచి ఇతర శాఖల్లో పనిచేసిన సీనియార్టీని పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App