TRINETHRAM NEWS

New approach in education system

3వ తరగతి వరకు అంగన్ వాడీల్లోనే ప్లేస్కూల్ తరహా బోధన
4 నుంచి సెమీ రెసిడెన్షియల్స్.. విద్యార్థులకు రవాణా సదుపాయం
విద్యావేత్తలతో చర్చించి ప్రణాళికలు రూపొందిచాలని విద్యాశాఖకు ముఖ్యమంత్రి ఆదేశాలు

Trinethram News : హైదరాబాద్ :
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను, విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని విద్యా శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ ముఖ్య కారదర్శి బుర్రా వెంకటేశం, ఇతర అధికారులకు సీఎం సూచించారు.

ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కు సమాంతరంగా అన్ని చోట్లా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తో కలిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ పై విద్యా శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం ఈ మేరకు సూచనలు చేశారు.

అంగన్ వాడీలకు సింగిల్ టీచర్
చిన్న పిల్లలకు సొంత గ్రామాల్లోనే సౌకర్యవంతంగా ఉండేలా ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీ కేంద్రాలలోనే విద్యాబోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంగన్ వాడీలలో ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా విద్యా బోధన కోసం ప్రత్యేకంగా ఒక టీచర్ నియమించేలా ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు.

రెసిడెన్షియల్స్ కు రవాణా సదుపాయం
3వ తరగతి వరకు అంగన్ వాడీ ప్లే స్కూల్ లో బోధన తర్వాత విద్యార్థులు 4వతరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకునేలా ప్రణాళికలు ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే ఆయా గ్రామాల నుంచి విద్యార్థులు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు వెళ్లివచ్చేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా చూడాలని సీఎం సూచించారు.

విద్యావేత్తలతో చర్చించాక పైలట్ ప్రాజెక్టు
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ప్లే స్కూల్, సెమీ రెసిడెన్షియల్ విధానాలకు సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేయడానికంటే ముందే విద్యా వేత్తల అభిప్రాయాలు తీసుకోవాలని విద్యా శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యావేత్తల సూచనలను బట్టి ముందుగా ఒకట్రెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేలా ప్రణాళికలు ఉండాలని సీఎం చెప్పారు.

సీఎస్ఆర్ ఫండ్స్ తోనూ..
పాఠశాల్లో వసతులు, సౌకర్యాల పెంపు కోసం ప్రభుత్వ నిధులతోపాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ ( సీఎస్ఆర్) ఫండ్స్ పైనా దృష్టి సారించాలని అధికారులకు సీఎం సూచించారు. వీటితోపాటు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

New approach in education system