TRINETHRAM NEWS

State Minister of IT, Industries and Legislative Affairs launched the Vanamahotsavam programme

నాటిన ప్రతి మొక్క సంరక్షణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు రాష్ట్ర ఐటి,పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

*వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి

పెద్దపల్లి, జూలై -03: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

వన మహోత్సవం కార్యక్రమం క్రింద జిల్లాలో నాటిన ప్రతి మొక్క సంరక్షణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని, మొక్కల పెంపకం, సంరక్షణలో నాణ్యత పెరగాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.

బుధవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పెద్ద కల్వలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, మునిసిపల్ చైర్ పర్సన్ మమతా రెడ్డి లతో కలిసి మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ,పర్యావరణ సమతుల్యత , మొక్కల పెంపకం, పచ్చదనం ప్రాముఖ్యత విద్యార్థి దశ నుంచే పిల్లలకు తెలియాలనే ఉద్దేశ్యంతో కళాశాల వద్ద వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అధికారులు జవాబుదారీతనంతో పూర్తి చేయాలని మంత్రి సూచించారు.

మొక్కల పెంపకం చాలా మంచి ఆలోచన అని, దీనివల్ల అనేక లాభాలు ఉంటాయని తెలిపారు. ఆలోచన బాగా ఉన్న ఆచరణ సరిగ్గా లేకపోతే ఆశించిన ఫలితాలు దక్కవని, పటిష్ట కార్యాచరణతో వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మొక్కలను నాటడంలో పెద్ద లక్ష్యాలను ఏర్పాటు చేసుకోకుండా, తక్కువ మొక్కలు నాటినప్పటికీ వాటిని వంద శాతం సంరక్షించాలని అన్నారు. ఇంటింటికి పంపిణీ చేసే మొక్కలు, రోడ్డుపై నాటే మొక్కల లెక్కలు పక్కాగా ఉండాలని అన్నారు.

పెద్దపల్లి, గోదావరిఖని ప్రాంతాల్లో అవసరమైన మేర మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ప్రభుత్వం నాటుతున్న మొక్కలు, ఇండ్లకు పంపిణీ చేస్తున్న మొక్కల ఆడిట్ నిర్వహించాలని అన్నారు. మొక్కల పంపిణీ పూర్తి చేసిన తర్వాత రెగ్యులర్ గా ఇంటింటికి సర్వే నిర్వహిస్తూ ఆ మొక్కల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అన్నారు.

పట్టణ ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన పూల మొక్కలు, ఇతర మొక్కలు కుండీలలో పెంచే విధంగా అందించే అవకాశాలు పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు. మన జిల్లాలో ఉన్న ఎన్.టి.పి.సి., ఆర్.ఎఫ్.సి.ఎల్., సింగరేణి, కేశోరాం సిమెంట్, రైస్ మిల్లులు, మొదలగు పరిశ్రమలు వాటి పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించేలా చూడాలని అన్నారు.

పచ్చదనం పెంచేందుకు చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని ఉద్యమంలా కొనసాగించాలని, రాజకీయాలకతీతంగా అందర్నీ కలుపుకొని పనిచేయాలని, ఆర్ అండ్ బీ శాఖ ప్రణాళికలు దృష్టిలో పెట్టుకుని రోడ్డుకు ఇరు వైపులా కొంచెం స్థలం విడిచిపెట్టి మొక్కల పెంపకం చేపట్టాలని మంత్రి సూచించారు.

అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం చెట్లను నరికి వేయకుండా ట్రాన్స్ ప్లాంట్ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని దీనిని పూర్తిస్థాయిలో వినియోగించు కోవాలని మంత్రి సూచించారు. మొక్కల పెంపకం ప్రాముఖ్యతను ఇంటింటికి తిరిగి వివరించి ప్రజలకు అవగాహనకల్పించాలని, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు.

కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరం జిల్లాలో 27 లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించామని, వంద శాతం నాటిన మొక్కల సంరక్షణకు ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ, మంత్రి చేతుల మీదుగా వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభించు కోవడం చాలా సంతోషకరమని అన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను అధిగమిస్తూ వన మహోత్సవం కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని పోవాలని అన్నారు.

మొక్కలు నాటే సమయంలో కరెంటు పోల్ దగ్గర పెట్టడం, రోడ్డుకు సమీపంలో నాటడం మానివేయాలని ఎమ్మెల్యే సూచించారు. పట్టణంలో ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్న మొక్కల పెంపకాన్ని పర్యవేక్షించేందుకు అందుబాటులో ఉన్న సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలని ఎమ్మెల్యే సూచించారు.

కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతా రెడ్డి మాట్లాడుతూ,చెట్ల సంరక్షణ ద్వారా భూ సంరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. పెద్దపల్లి పట్టణంలో మున్సిపల్ బడ్జెట్ లో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కు కేటాయించుకొని ప్రస్తుత సంవత్సరం లక్షా 30 వేల మొక్కల పెంపకం లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ కింద 11 వేల మొక్కలు, బ్లాక్ ప్లాంటేషన్ కింద 7 వేల 600 మొక్కలు, మిగిలిన మొక్కలు ఇండ్లకు పంపిణీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. అవెన్యూ, బ్లాక్ ప్లాంటేషన్లు నాటే మొక్కల సంరక్షణ కోసం అవసరమైన మేరకు ట్రీ గార్డులు, వాటికి నీరు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇండ్లకు అందించే మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యతను పౌరులు తీసుకోవాలని, గ్రీన్ పెద్దపల్లి రూపకల్పన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో పౌరులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

అంతకుముందు మంత్రి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తో మాట్లాడుతూ, డిగ్రీ కళాశాల గ్రౌండ్ ను విద్యార్థుల సౌకర్యార్థం గ్రౌండ్ చుట్టూ గార్డెనింగ్, ప్లే గ్రౌండ్ గా అభివృద్ధి చేయాలని, దీనికి సంబంధించిప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని మంత్రి సూచించారు.

ఈ సమావేశంలో ఏ.సి.పి. -జి. క్రిష్ణ, పెద్దపల్లి మున్సిపల్ కమీషనర్ శ్రీకాంత్, జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య, డి.ఆర్.డి.ఓ. రవీందర్, జెడ్పీ సి.ఈ.ఓ. నరేందర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, జెడ్పిటిసి రామ్మూర్తి, మున్సిపల్ కౌన్సిలర్ లు, ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

State Minister of IT, Industries and Legislative Affairs launched the Vanamahotsavam programme