Measures taken to control fever in Gaureddipeta village by Zilla Panchayat Adhikari Ashalata
పెద్దపల్లి, జూన్ -18: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గౌరెడ్డిపేట గ్రామంలో ప్రజలకు వస్తున్న జ్వరాల నియంత్రణకు అవసరమైన చర్యలు పకడ్బందీగా తీసుకుంటున్నామని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత తెలిపారు.
మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి ఆశా లత పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామాన్ని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, మిషన్ భగీరథ సాంకేతిక నిపుణులతో కలిసి సందర్శించారు.
గౌరెడ్డి పేట గ్రామాన్ని ఆసాంతం పరిశీలించిన జిల్లా పంచాయతీ అధికారి బృందం, జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వారిని పరిశీలించి వారికి వైద్య సిబ్బందితో తగిన వైద్య చికిత్స అందించడం జరిగిందని, ప్రస్తుతం గ్రామంలో జ్వరాలు తగ్గుముఖం పట్టాయని పంచాయతీ అధికారి తెలిపారు.
గ్రామంలోని ప్రతి వీధిని పరిశీలించిన పంచాయతీ అధికారి కాలువలు, రోడ్ల శుభ్రత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు, ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్వల దగ్గర ఫాగింగ్ చేయించాలని జిల్లా పంచాయతీ అధికారి పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.
గ్రామ ప్రజలంతా ప్రైవేట్ మినరల్ ప్లాంట్ నుంచి త్రాగునీరు తాగుతున్నారని తెలుసుకున్న పంచాయతీ అధికారి బృందం, సదరు ప్రైవేట్ మినరల్ ప్లాంట్ ను సందర్శించి ఆ నీటిని పరీక్షించగా అందులో లవణాల శాతం 50 శాతం మాత్రమే ఉండటంతో గ్రామ ప్రజలకు జాయింట్ పెయింట్స్ వస్తున్నాయని మిషన్ భగీరథ సాంకేతిక నిపుణులు తెలియజేశారు.
గ్రామ ప్రజలకు ప్రైవేట్ వాటర్ ప్లాంట్ నీటిని తాగకూడదని వివరించడం జరిగిందని, అదే విధంగా ప్రైవేట్ వాటర్ ప్లాంట్ ను శాశ్వతంగా సీజ్ చేసి మూసివేయడం జరిగిందని, గ్రామ ప్రజలకు సరఫరా చేసే మిషన్ భగీరథ, బోర్ నీటిని పరిశీలించగా లవణాలు 200 శాతం పైగా ఉన్నట్లు గుర్తించామని, గ్రామ ప్రజలు మిషన్ భగీరథ నీటిని కాచి, చల్లార్చి తాగాలని పంచాయతీ అధికారి సూచించారు.
గౌరెడ్డి పేట గ్రామంలో వైద్య సిబ్బందిచే మెడికల్ క్యాంపు నిర్వహించి తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని పంచాయతీ అధికారి పేర్కొన్నారు.
ఈ పర్యటనలో జిల్లా పంచాయతీ అధికారి వెంట డివిజనల్ పంచాయతీ అధికారి, మండల పంచాయతీ అధికారి, ఎంపీడీవో, వైద్యాధికారులు, మిషన్ భగీరథ సాంకేతిక నిపుణులు, తదితరులు పాల్గొన్నారు
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App