TRINETHRAM NEWS

పోలీస్ ఉద్యోగాల భర్తీలో జీవో నెం.46పై ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు వినతిపత్రం సమర్పించారు. జీవో నుంచి కోడ్ నెం.24 TSSP (5000) మినహాయించాలని కోరారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి స్థానిక నిరుద్యోగుల ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

CD1, CD2 ప్రకారం ఫలితాలు ప్రకటించి మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్లీ ఫలితాలు ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును అమలు జరిగేలా చూడాలన్నారు. చాలా జిల్లాల్లో మిగిలిపోయిన ఖాలీలను భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఉమ్మడి జిల్లాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకం చేసిన లేఖను ముఖ్యమంత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీ కుందూరు జై వీర్ రెడ్డి, శ్రీమతి పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ బాలు నాయక్, శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, శ్రీ బీర్ల ఐలయ్య, శ్రీ మందుల సామ్యూల్, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.