TRINETHRAM NEWS

Police on high alert in Tadipatri – If there is a difference, you have to go around the stations until you die – Officials warn the leaders!

Trinethram News : ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో ఎక్కడా ఏ సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. జిల్లాను పోలీసులు అష్ట దిగ్బంధనం చేశారు.

రాయలసీమలో భాగమైన ఉమ్మడి అనంతపురం రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక్కడ ఎక్కువ శాతం రాజకీయ పగలు, ప్రతీకారలతోనే జీవిస్తుంటారు. ఎన్నికలు వస్తే చాలు అనంతపురం రణరంగంగా మారుతుంది. పెనుగొండ, ధర్మవరం, రాప్తాడు, తాడిపత్రిలో ఈ తరహా రాజకీయం ఎక్కువగా ఉంటుంది. తాజా ఎన్నికల్లో సైతం అనంతపురం జిల్లా తాడిపత్రి జాతీయ స్థాయిలో చర్చకు కారణమైంది. జేసీ, పెద్దారెడ్డి వర్గాల ఘర్షణ అనంతపురం జిల్లాను మరో సారి ఉలిక్కిపడేలా చేసింది. ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా రాజకీయం మరోసారి వేడెక్కింది.

పకడ్బందీ చర్యలు

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో ఎక్కడా ఏ సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. పోలింగ్‌ రోజు, ఆ తర్వాత తాడిపత్రి, ఇతర ప్రాంతాల్లో అల్లర్లు, గొడవలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లెక్కింపు రోజు, ఆ తర్వాత ఎక్కడా ఏ అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా పోలీసులు జిల్లాను అష్ట దిగ్బంధనం చేశారు. ఓట్ల లెక్కింపు సజావుగా, పారదర్శకంగా జరపడానికి కలెక్టర్‌ వినోద్‌కుమార్, ఎస్పీ గౌతమి శాలి సంయుక్త కార్యాచరణతో సన్నాహాలు చేపట్టారు.

జిల్లా వ్యాప్తంగా 315 ప్రాంతాలపై నిఘా

జిల్లా వ్యాప్తంగా 315 సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా ఉంచారు. ప్రతి నియోజకర్గ పరిధిలో ఒక డ్రోన్‌ తిరగనుంది. ఎక్కడికక్కడ వీడియోలను చిత్రీకరించనున్నారు. అలాగే అనంతపురం సిటీలో 275 అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎవరు గొడవలు చేసినా క్షణాల్లో అక్కడ వాలిపోయేలా పోలీసులు ఏర్పాటు చేశారు. ఫలితాల సందర్భంగా ఎవరైనా అల్లర్లు, హింస, ఆస్తుల ధ్వంసానికి పాల్పడితే నిర్దాక్షిణ్యంగా కేసులు నమోదు చేసి జైళ్లకు పంపాలని నిర్ణయించారు. బెయిల్‌ వచ్చినా చచ్చే వరకు పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరిగేలా నిర్దేశిత సెక్షన్లు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

తాడిపత్రిలో అదనపు భద్రత

పోలింగ్ సందర్భంగా తాడిపత్రిలో హింసా కాండ చెలరేగింది. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలో పోలీసులు సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం వివాదాస్పదంగా మారింది. అలాగే వైసీపీ, టీడీపీ వర్గాలు పరస్పర దాడులకు దిగాయి. ఆయా పార్టీల కార్యకర్తలు, నేతలు రోడ్లపైకి వచ్చి రాళ్లు రువ్వుకున్నారు. పోటా పోటీగా క్రాకర్స్ కాలుస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో జేసీ, పెద్దారెడ్డిని రాష్ట్రం దాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా కౌంటింగ్ సందర్భంగా నియోజకవర్గంలో మరోసారి అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. నియోజకవర్గం వ్యాప్తంగా అదనపు బలగాలను మొహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

బయట వ్యక్తులకు నో పర్మిషన్

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈనెల 4వ తేదీన నగరంలోకి బయటి వ్యక్తులు ఎవరూ ప్రవేశించడానికి అనుమతి లేదని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. కౌంటింగ్‌ ఏజెంట్లు సోమవారం రాత్రి నగరానికి రావాలని సూచించారు. లాడ్జీలు, హోటళ్లు, కమ్యూనిటీ హాళ్లు, షాదీ ఖానాలు, కల్యాణ మండపాలను పరిశీలించే బాధ్యతలను వీఆర్‌ఓలకు అప్పగించారు. ఎస్పీ గౌతమి శాలి మాట్లాడుతూ.. జిల్లాలో సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఎక్కడా గొడవలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కౌంటింగ్ రోజు ఎవరైనా అల్లర్లు గొడవలు సృష్టిస్తే మాత్రం రౌడీషీట్ ఓపెన్ చేసి లోపల వేస్తానని హెచ్చరించారు.

జేఎన్టీయూలో ఓట్ల లెక్కింపు

అనంత జేఎన్‌టీయూలో మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సారథ్యంలో ఇప్పటికే ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇనుప బారికేడ్లు, సీసీ కెమెరాలు, ఫర్నీచర్, టేబుళ్లు, గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎం ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. అనంత లోక్‌సభ పరిధిలో 8 కేంద్రాల్లో 2236 ఈవీఎంలను లెక్కించాలి. అలాగే అసెంబ్లీ వారీగా లెక్కింపు జరగనుంది. ఈ మేరకు కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్క ఉరవకొండ నియోజకవర్గానికి మాత్రమే 18 టేబుళ్ల ఏర్పాటు చేసి 15 రౌండ్లల్లో లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఇతర అన్ని నియోజకవర్గాల్లో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Police on high alert in Tadipatri - If there is a difference, you have to go around the stations until you die - Officials warn the leaders!