ఆమ్ ఆద్మీ పార్టీ చాలా చిన్న పార్టీ అన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ పార్టీ స్థాపించి కేవలం 10 సంవత్సరాలు అయిందన్నారు. ప్రస్తుతం తన పార్టీ రెండు రాష్టాల్లో అధికారంలో కొనసాగుతోందని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొలి సారి మీడియా సమావేశం నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల వేళ కేజ్రీవాల్ ఇదే తొలి ప్రెస్ మీట్. తన పార్టీని అంతం చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీలోని దాదాపు 4 కీలక నేతలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారన్నారు.
ఏడాది కాలంగా ఈ అరెస్టులు జరుగుతున్నాయని వివరించారు. అందులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్ ఈ నలుగురు ఉన్నారన్నారు. దేశంలో చాలా పెద్ద పెద్ద పార్టీల నేతలను అరెస్ట్ చేసి జైల్లో పెడితే పార్టీ అంతరించిపోతుందన్నారు. అందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలను అరెస్ట్ చేస్తే పార్టీ అంతరించి పోతుందని భావించారన్నారు. కానీ అలా జరగలేదన్నారు. ఈ పార్టీని ఎంత తొక్కాలని ప్రయత్నిస్తుంటే అంత ఎత్తుకు ఎదుగుతోందని చెప్పారు సీఎం కేజ్రీవాల్.
గతంలో జైలు నుంచే పాలన అందించిన కేజ్రీవాల్ ఒక్కసారిగా ప్రజల్లోకి రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే సీఎం కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ మనీలాండరింగ్ కేసులో లిక్కర్ పాలసీ కుంభకోణంలో అరెస్టు చేసింది. నిన్నటి వరకు ఆయన జ్యుడీషియల్ కస్టడీ కింద తీహార్ జైలులో ఉన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ తరఫున ప్రచారం చేసుకునేందుకు మధ్యంతర బెయిల్ పై ఫిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవడం కోసం 21 రోజులు అనుమతి ఇచ్చింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఊరట లభించినట్లయింది.