Trinethram News : ప్రపంచంలో అత్యంత విలువైనది వ్యక్తుల డేటా.. ఇన్‌ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అంటూ సినిమాల్లో డైలాగ్ లు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు సరిగ్గా ఇదే జరిగింది. ఏకంగా 75లక్షల మంది డేటా ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టేశారు. అందులో వ్యక్తుల ఫోన్ నంబర్లు, అడ్రస్ లు, ఈ-మెయిల్ ఐడీలు అన్నీ ఉన్నాయి. అది కూడా ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీకి చెందిన డేటా బేస్ లోని సమాచారం డార్క్ వెబ్ లో పోస్ట్ చేశారు. దానిని విక్రయిస్తామంటూ పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది.
దేశంలో తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాచుర్యం పొందింది బోట్ సంస్థ. తక్కువ ధరకే క్వాలిటీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను అందిస్తూ అత్యంత ప్రజాదరణ పొందింది. స్మార్ట్ వాచ్ లతో పాటు ఇయర్ బడ్స్, నెక్ బ్యాండ్ వంటి ఆడియో ఉత్పత్తులకు ఇది దేశంలో నంబర్ బ్రాండ్ గా ఉంది. మనలో చాలా మంది ఈ బ్రాండ్ ఉత్పత్తులను వినియోగించే వారు ఉంటారు. అయితే బోట్ ఉత్పత్తులను వినియోగిస్తున్న వారికి ఓ షాకింగ్ న్యూస్ అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఫోర్బ్స్ ఒక నివేదికలో తెలిపింది. బోట్ కంపెనీకి చెందిన దాదాపు 7.5 మిలియన్(75లక్షలు) వినియోగదారుల వ్యక్తిగత డేటా చోరీకి గురైనట్లు స్పష్టం చేసింది. వినియోగదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీ, కస్టమర్ ఐడీలు డార్క్ వెబ్ లో ప్రత్యక్షం అయినట్లు ఫోర్బ్స్ ఆ నివేదికలో పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎవరు చేసినట్లు..
షాపిఫైగై(ShopifyGUY) అనే హ్యాకర్ బోట్ కస్టమర్ డేటాను ఏప్రిల్ 5వ తేదీని డార్క్ వెబ్ లో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీని వల్ల యూజర్ల డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలో పడి.. వ్యక్తులపై సైబర్ అటాక్స్ జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు దాదాపు 2 జీబీ స్టోరేజ్ కలిగిన ఈ కస్టమర్ డేటా డార్క్ వెబ్ లో ఉన్నట్లు ఫోర్బ్స్ పేర్కొంది. దీంతో 75లక్షల మంది వినియోగదారులకు ప్రమాదం పొంచి ఉంది. ఈ కస్టమర్లకు భవిష్యత్తులో ఆర్థిక మోసాలు, ఫిషింగ్, ఐడెంటిటీ థెఫ్ట్ గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఈ డేటా చోరీ జరగడం వల్ల కేవలం కస్టమర్ల గోప్యత, భద్రత దెబ్బతినడమే కాకుండా.. బోట్ కంపెనీ పట్ల వినియోగదారులకు నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు. అంతేకాక సంస్థ చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటుందని.. వారి ప్రతిష్టకు కూడా భంగం కలిగినట్లేనని చెబుతున్నారు.
అమ్మకానికి డేటా..
డార్బ్ వెబ్ లో ఉంచిన డేటా కొన్ని ఆన్ లైన్ ప్లాట్ ఫారంలు విక్రయానికి పెట్టినట్లు కూడా తెలుస్తోంది. కేవలం రెండు యూరోలకే ఈ మొత్తం డేటాను విక్రయానికి పెట్టడం వినియోగదారులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలో బోట్ తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ డేటా సహాయంతో రానున్న కాలంలో సైబర్ నేరగాళ్లు ఆర్థిక నేరాలకు పాల్పడే అవకాశం ఉండటంతో వీలైనంత త్వరగా బోట్ ప్రతి చర్య ప్రారంభించాల్సి ఉందని సైబర్ నిపుణులు చెబుతున్నారు..
వినియోగదారులు ఇలా చేయండి..
బోట్ వినియోగదారులు తక్షణమే అప్రమత్తం అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. డార్క్ వెబ్ లో ఉన్న డేటా మొత్తం ప్రమాదం ఉన్నట్లేనని.. వివిధ అకౌంట్లకు ఒకే పాస్ వర్డ్ పెట్టుకున్న వ్యక్తులు వెంటనే పాస్ వర్డ్ లను మార్చాలని సూచిస్తున్నారు. అలాగే ప్రతి అకౌంట్ కు టూ స్టెప్ వెరిఫికేషన్ వంటివి పెట్టుకోవాలని చెబుతున్నారు. ఇది మీ ఖాతాల అనధికారిక యాక్సెస్ ను నిరోధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.