TRINETHRAM NEWS

Trinethram News : మంగళగిరి:

తెలుగు వారు గొప్పగా నిర్వహించు కునే పండగ ఉగాది అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కొత్త ఏడాదిలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వాలంటీర్లకు తీపికబురు చెప్పారు. తాము అధికారంలోకి రాగానే వారికి రూ.5 వేలు కాదు.. రూ. 10 వేల గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని తాము ముందే చెప్పామని వెల్లడించారు. ప్రజలకు సేవచేస్తే.. తాము అండగా ఉంటామని వాలంటీర్లకు తెలిపామని వివరించారు.

”మన దశ, దిశ నిర్దేశించుకునే వేడుక.. కొత్త ఉత్సాహం అందించే పండగ ఇది. ఉగాది సందర్భంగా కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. ఈ ఏడాదిలో సాధికారత రావాలి. నూతన సంవత్సరంలో ధరలు తగ్గాలి.. సంక్షేమం ఉండాలి. ఉగాది పచ్చడిలో తీపి, వగరు, చేదు.. అన్నీ ఉంటాయి. ఈ ఐదేళ్లలో బకాసురుడిని మించిన పాలన సాగింది. రాష్ట్రంలో కారం, చేదు రుచులే ఉన్నాయి. అశాంతి, అభద్రతాభావం కనిపిస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం. నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకూ నీళ్లు ఇవ్వొచ్చు. సహజ వనరులన్నీ వైకాపా దోపిడీ చేసింది. తెలుగు జాతికి మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలని మనమంతా సంకల్పం తీసుకోవాలి. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి.. ఇదే మన సంకల్పం” అని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబుకు అధికార యోగం ఉంది: పంచాంగకర్త మాచిరాజు

ఈ సందర్భంగా పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్‌ నేతృత్వంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. రాష్ట్రంలో త్రిమూర్తుల కలయికతో ఏపీకి మేలు జరుగుతుందని తెలిపారు. 128 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పారు. చంద్రబాబుకు అధికార యోగం ఉందని వివరించారు. ఆయనే రాజధాని అమరావతి నిర్మాణం చేపడతారని వెల్లడించారు.