Trinethram News : విజయవాడ నగర శివారు కానూరులో అగ్ని ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం న్యూ ఆటోనగర్‌లోని ఆయిల్ శుద్ధి చేసే కేంద్రంలో భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో పొగ దట్టంగా అలుముకుంది..
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పారు. దాదాపు మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు..
అనుమతులు లేకుండా ఈ కర్మాగారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం 8 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆస్తినష్టం భారీగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడతామని అగ్నిమాపక శాఖ ఏడీ శ్రీనివాసులు తెలిపారు. వేసవి కాలంలో అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయని, కానీ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముందు జాగ్రత్త వహిస్తే పెను ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు..