TRINETHRAM NEWS

Trinethram News : దిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘంతో గూగుల్‌ జట్టు కట్టింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు కొన్ని చర్యలు చేపట్టింది..

అధీకృత సమాచారం మాత్రమే ప్రజల్లోకి వెళ్లేలా చూడడంతో పాటు ఏఐని వినియోగించి రూపొందించే వీడియోలకు లేబుల్ వేయాలని నిర్ణయించింది. ఎన్నికల్లో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొంది..

ఓటరుగా పేరు ఎలా నమోదు చేసుకోవాలి? ఎలా ఓటు వేయాలి? వంటి సమాచారాన్ని సులువుగా తెలుసుకోవడం కోసం ఈసీతో జట్టు కట్టినట్లు గూగుల్‌ తెలిపింది. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ సమాచారం లభిస్తుందని పేర్కొంది. ఏఐని వినియోగించి రూపొందించే కంటెంట్‌ను గుర్తించడం సులభతరం చేసినట్లు గూగుల్‌ తెలిపింది. డీప్‌ఫేక్‌, మార్ఫింగ్‌ చేసిన మీడియాను కట్టడి చేసినట్లు పేర్కొంది. యూట్యూబ్‌లోని ఏఐ ఫీచర్లతో క్రియేట్‌ చేసిన కంటెంట్‌కు ఇప్పటికే లేబుల్‌ వేయడం ప్రారంభించామని వెల్లడించింది..

గూగుల్‌కు చెందిన ఏఐ జెమినిపై విమర్శల నేపథ్యంలో గూగుల్‌ మరో నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఇవ్వకుండా గూగుల్‌ ఆంక్షలు విధించింది. యూట్యూబ్‌, గూగుల్‌ సెర్చ్‌లో ఎన్నికలకు సంబంధించిన వార్తలు, సమాచారం కూడా అధీకృత వేదికల నుంచే డిస్‌ప్లే అయ్యేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే తప్పుడు సమాచారం, హింసను ప్రేరేపించేవి, విద్వేష వ్యాఖ్యల విషయంలో విధానాలు రూపొందించినట్లు పేర్కొంది. పాలసీకి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ను తొలగించేందుకు గానూ మనుషులతో పాటు మెషిన్‌ లెర్నింగ్‌ను కూడా వినియోగించనున్నట్లు తెలిపింది. ఎన్నికలకు సంబంధించిన ప్రకటనల మీదా కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు గూగుల్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొంది..