ప్రభుత్వ వైన్ షాపులలోని సిబ్బంది సహకారంతో రెచ్చిపోతున్న మద్యం మాఫియా…
ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరపున వైన్ షాపులను ఏర్పాటు చేశారు. గతంలో మద్యం షాపులకు వేలంపాట నిర్వహించి అత్యధిక పాటదారులకు షాపులను అప్పగించేవారు.
కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ప్రభుత్వమే షాపులను నిర్వహిస్తూ, ప్రభుత్వం తరఫున సిబ్బందిని నియమించారు. షాపులలో ఒక సూపర్వైజర్ తో పాటు షాపుల అమ్మకాన్ని బట్టి ముగ్గురు లేదా నలుగురిని సేల్స్ మెన్లుగా ఉన్నారు.
మోపిదేవి మండలంలో మూడు షాపులను కేటాయించారు. మోపిదేవి బస్టాండ్ వెనుక వైపున ఒకటి, మోపిదేవి నుండి మోపిదేవి లంక వెళ్లే రోడ్డులో ఒకటి, పెదకల్లేపల్లి గ్రామంలో మరొక షాపు ద్వారా మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. షాపులలోని సిబ్బందిని స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన వారిని నియమించారు.
షాపులలోని సిబ్బంది సహాయ సహకారాలతో మద్యాన్ని మద్యం మాఫియా బెల్టు షాపులకు చేరవేస్తున్నారు. ప్రతి క్వార్టర్ బాటిల్ పైన షాపు సిబ్బంది పది రూపాయలు అదనంగా తీసుకుని మద్యం మాఫియాకు విక్రయిస్తున్నారు. మద్యం మాఫియా మరో 20 రూపాయలు అదనంగా వేసుకొని బెల్ట్ షాపు నిర్వాహకులకు అమ్ముకుంటున్నారు. బెల్ట్ షాపులు ఒక్క క్వార్టర్కు 50 రూపాయలు అదనంగా మద్యం బాబులనుండి వసూలు చేస్తున్నారు.
మోపిదేవి మండలంలోని 13 గ్రామపంచాయతీలలో బెల్టు షాపులు అధికార పార్టీ మాజీ నాయకుడి కనుసన్నలలో మూడు పువ్వులు ఆరుకాయలు అన్న చందాన కొనసాగుతున్నాయి.
గత రెండు రోజుల క్రితం మోపిదేవి వైన్ షాపు వద్ద జరిగిన సంఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. బస్టాండ్ సమీపంలోని ఒక వైన్ షాప్ నుండి మద్యాన్ని తరలిస్తున్న సేల్స్ మెన్ ను విజయవాడకు చెందిన ఈఎస్ స్క్వాడ్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఎస్సై పి వి త్రినాధరావు ఆధ్వర్యంలో అదుపులోనికి తీసుకున్నారు. సంబంధిత సేల్స్ మెన్ నుండి సుమారు రెండు కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకుని అతనిని విధులనుండి తొలగించారు.
సేల్స్ మెన్ ను విధులనుండి మాత్రమే తప్పించి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఒక మంత్రి నుండి ఒత్తిడి రావడంతో షాపులోని మరో బాధ్యత గల ఉద్యోగి బైకుపై మద్యాన్ని తరలిస్తూ ఉండడం విశేషం.
ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారులతో పాటు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంబంధిత విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేసి మిగిలిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతో పాటు బెల్టు షాపులను అరికట్టాలని మండల ప్రజలు ముక్తకంఠంగా కోరుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆశయాలకు తూట్లు పడే విధంగా అధికార పార్టీకి చెందిన నేతలే మద్యం మాఫియాను ప్రోత్సహించడం పట్ల ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.