Trinethram News : హైదరాబాద్: లోక్ సభ (Loksabha) ఎన్నికలు సమీపిస్తున్నాయ్.. ఓ వైపు ఇద్దరు ఎంపీల (MP) రాజీనామా, మరో ముగ్గురు ఎంపీలు పార్టీ వీడేందుకు సిద్దం అని జోరుగా ప్రచారం..
ఇక లాభం లేదనుకొన్న గులాబీ దళపతి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ (KCR) రంగంలోకి దిగారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు (Telangana Bhavan)వస్తున్నారు.
17వ తేదీన రావాల్సింది..
తుంటి ఎముక శస్త్ర చికిత్స తర్వాత ఆదివారం నాడు (ఈ రోజు) కేసీఆర్ తెలంగాణ భవన్ వస్తున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి 17వ తేదీన, కేసీఆర్ బర్త్ డే రోజున తెలంగాణ భవన్ రావాల్సి ఉంది. ఇతర కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్‌లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గల బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం అవుతారు. పార్టీ బలోపేతం, ఈ నెల 10వ తేదీన కరీంనగర్‌లో నిర్వహించే సభ గురించి మాట్లాడతారు. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని, డీలా పడిపోవద్దని నేతల్లో మనోధైర్యం నింపుతారు కేసీఆర్. ఇటీవల జిల్లాల్లో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాటిని ఎలా ఎదుర్కొవాలనే అంశంపై సూచనలు ఇస్తారు కేసీఆర్
ఎంపీలు పార్టీ వీడటంతో అలర్ట్
2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలను గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదని రాజకీయ పరిణామాల ద్వారా తెలుస్తోంది. పార్టీని సిట్టింగ్ ఎంపీలు వీడుతున్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూలు ఎంపీ పి రాములు బీఆర్ఎస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు. ఇద్దరు నేతలు భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ ఫస్ట్ లిస్ట్‌లో బీబీ పాటిల్‌కు టికెట్ దక్కింది. నాగర్ కర్నూలులో రాములుకు బదులు అతని కుమారుడు భరత్‌కు టికెట్ కేటాయించారు. మరో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని.. రేపో, మాపో కమలం గూటికి చేరడం ఖాయం అని తెలుస్తోంది. కుమారుడి టికెట్ కోసం మాజీ మంత్రి ప్రయత్నించారని, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీతో చర్చలు జరిపారని ప్రచారం జరుగుతోంది.
రంగంలోకి కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీని నేతలు వీడుతున్నారనే వార్తల నేపథ్యంలో కేసీఆర్ అప్రమత్తం అయ్యారు. తాను ఉన్నాననే భరోసా ఇచ్చేందుకు రంగంలోకి దిగారు. అందుకోసమే ఈ రోజు తెలంగాణ భవన్ వస్తున్నారు. ఇకపై రోజు తాను అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. పార్టీ నేతలు, శ్రేణులకు మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని కేసీఆర్ చెబుతున్నారు. అందుకోసం కేసీఆర్ రంగంలోకి దిగారు. కేసీఆర్ రాకతో అయినా ఆ పార్టీ వలసలకు బ్రేక్ పడుతుందో లేదో చూడాలి మరీ..