Trinethram News : హైదరాబాద్: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. 12వ నిందితుడిగా ఉన్న మీర్జా వాహిద్‌ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గజ్జల వివేకానంద్‌కు సయ్యద్ అబ్బాస్ డ్రగ్స్ సరఫరా చేసేవాడు. వివేకానంద్ కొకైన్ కావాలని కోరినపుడు మీర్జా వాహిద్ నుంచి అతడు తీసుకొచ్చేవాడు. ఈ నేపథ్యంలో ఈ కేసుతో సంబంధాలపై మీర్జాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ పార్టీకి సినీ దర్శకుడు క్రిష్ హాజరైనట్లు దర్యాప్తులో తేలడంతో పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు. సోమవారం వస్తానని ఆయన సమాచారం ఇచ్చినట్లు తెలిసింది..
మరోవైపు కేసులో నిందితురాలిగా ఉన్న యూట్యూబర్ లిషిత పరారీలో ఉన్న విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం ఆమె ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. దీంతో లిషిత సోదరి కుషిత పీఎస్‌కు వచ్చి నోటీసులకు సమాధానం ఇచ్చారు. ఆమె ఇంట్లో లేదని.. వచ్చాక విచారణకు పంపిస్తామని తెలిపారు. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చినప్పటి నుంచి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణకు లిషిత కచ్చితంగా రావాలని ఆమె సోదరికి పోలీసులు స్పష్టం చేశారు..