Trinethram News : Arvind Kejriwal: అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని(wins trust vote) ప్రవేశపెట్టిన అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) భారీ మద్దతుతో విజయం సాధించారు.
తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ(bjp) కుట్ర చేస్తోందని ఇటీవలే ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. ఈ నేపథ్యంలోనే ఆయన బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఈ విశ్వాస తీర్మానం సందర్భంగా కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందని మరోసారి ఆరోపించారు. ఏడుగురు ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఆఫర్ చేసిందని విమర్శించారు.
కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీజేపీ(bjp)కి సవాల్ విసిరే పార్టీ ఆమ్ ఆద్మీపార్టీ(Aam Aadmi Party)నే అని అన్నారు. అందుకే తమను చూసి కమలం పార్టీ ఆందోళన చెందుతోందని, తమ పార్టీని దెబ్బతీయాలని చూస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినా.. 2029లో మాత్రం ఆ పార్టీని తాము తప్పక ఓడిస్తామని ఈ సందర్భంగా కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha elections) ఢిల్లీ ప్రజల ఓట్లు అడిగే ధైర్యం ఉందా అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి సవాల్ విసిరారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీయే విజయం సాధించినప్పటికీ ప్రజలకు ఆ పార్టీ నుంచి విముక్తి కల్పించే బాధ్యతను తమ పార్టీయే తీసుకుంటుందని తేల్చి చెప్పారు. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి ఈ లక్ష్యాన్ని సాధిస్తామని స్పష్టం చేశారు.
కాగా, ఆప్ ప్రభుత్వంలో గతంలో రద్దయిన మద్యం కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీచేసింది. ఈ తరుణంలోనే సీఎం కేజ్రీవాల్ కోర్టుకు వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా హాజరయ్యారు. శనివారం ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలతో పాటు అవిశ్వాస తీర్మానం ఉన్న కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.