కన్నెపిల్లల ఇళ్లే టార్గెట్.!పెద్ద పెద్ద కాళ్ళు, ఇరబోసిన జుట్టు తో, చీకటిలో తిరుగుతోన్న నల్లటి ఆకారం.. అరుపులు, వింతశబ్దాలు..ఆ గ్రామంలో రాత్రి నిద్రే కరువు?..అసలు స్టోరీ ఏంటి?
శివ శంకర్. చలువాది
అది దెయ్యమా? లేక అదృశ్య శక్తా..?
కాకినాడజిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో అసలేం జరుగుతోంది.?
ఓ అదృశ్యశక్తి తిరుగుతోందంటూ స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
చీకటిపడితే చాలు ఇంట్లోంచి బయటికి రావడానికి జంకుతున్నారు. మరి నిజంగానే గ్రామంలో అదృశ్యశక్తి తిరుగుతోందా..?
చొల్లంగి అమావాస్య రోజు దెయ్యాలు కనిపిస్తాయా?
అసలు ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో కొన్ని రోజుల క్రితం పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఎండు మిరపకాయలతో పూజలు చేశారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత గ్రామంలో ఓ ఇంటి దగ్గర మేకను చంపి తినేసిన ఆనవాళ్లు ఉండటంతో.. నిజంగానే గ్రామంలో ఆగంతకుడు తిరుగుతున్నాడనే ప్రచారానికి జోరందుకుంది. దాంతో అమావాస్య రోజు గ్రామంలోని శివాలయంతో పాటు నూకాలమ్మ తల్లి ఆలయంలో అష్టభైరవి మహాశక్తి హోమం చేయడం ప్రారంభించారు గ్రామస్తులు. ఓ అమావాస్య రోజు అర్ధరాత్రి అజ్ఞాత వ్యక్తి ఒక ఇంటి తలుపు తట్టి ఇంట్లో వాళ్ళు లేచే లోపు బట్టలు లేకుండా నగ్నంగా పొడవైన జుట్టు, పెద్ద పెద్ద పాదాలతో నల్లటి రూపంలో చెట్టుపై నుంచి దూకి వెళ్లిపోయాడని చెబుతున్నారు అక్కడున్న కొంతమంది మహిళలు. చీకటి పడిందంటే చాలు.. గ్రామంలో ఏ వీధికి వెళ్ళినా.. కర్రలతో యువకులు కాపలా కాస్తూ కనిపిస్తారు. చాలామంది వృద్ధులు, మహిళలు ఆ భయంకర రూపాన్ని తమకల్లారా చూసామని భయంతో చెబుతున్నారు.
కొన్ని రోజుల క్రితం గ్రామానికి చివర్లో ఉన్న తోటల్లోంచి ఇద్దరు వ్యక్తులు నగ్నంగా పరుగులు తీస్తూ కనిపించిన వీడియో ఒకటి గ్రామంలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తులను చూసి భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు. నిజంగానే అదృశ్య శక్తి గ్రామంలో సంచరిస్తుందన్న దానికి ఇక్కడ జరిగే పరిణామాలు నిజమనిపించేలా చేస్తున్నాయి. అరుపులు, కేకలు వింత శబ్దాలు విన్న గ్రామ పెద్దలు ఇలాంటివి ఎప్పుడూ వినలేదని చెప్పారు. చీకటి పడితే చాలు ఎవరింటికి ఆ వింత ఆకారశక్తి వస్తుందో తెలియక భయంతో గడుపుతున్నామంటున్నారు గ్రామస్తులు. ఈ నేపథ్యంలో గ్రామంలో అష్ట భైరవ మహాశక్తి హోమం నిర్వహిస్తున్నారు. మరోవైపు శివాలయం దగ్గర ఉన్న కోటలో గుప్త నిధుల కోసమే ఇలాంటి ప్రచారం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కన్నెపిల్లలు ఉన్న ఇళ్ల దగ్గరే అదృశ్యశక్తి తిరుగుతుందని మరికొందరు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో మొత్తం 8 దిక్కుల్లో ఈ అదృశ్యశక్తి తిరుగుతోందని భావించి.. కొందరు పండితులు అష్టభైరవ మహాశక్తి హోమాన్ని ప్రారంభించారు. అమావాస్య రోజున అదృశ్య శక్తి జాడ కనిపించలేదు గానీ.. ఇంతకీ అది అసలు నిజమో.. కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..