TRINETHRAM NEWS

Trinethram News : యాదాద్రి జిల్లా : ఫిబ్రవరి 04
ఇద్ద‌రు విద్యార్థినీలు త‌మ బాధ‌ల‌ను ఎవ‌రికి చెప్పుకోలేక త‌నువులు చాలించారు. ఈఘ‌ట‌న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం చోటుచేసుకుంది.

భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్‌లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన బాలికలు భువనగిరిలోని రెడ్డివాడ బాలికలఉన్నత పాఠశాలలో హాస్టల్‌లో ఉంటూ 10వ తరగతి చదువుతున్నారు. ఎప్పటిలాగే శనివారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు సాయంత్రం తిరిగి హాస్టల్‌కు చేరుకున్నారు.

ఇద్దరూ హాస్టల్‌లో ట్యూషన్‌కు వెళ్లలేదని.. ట్యూషన్ టీచర్ పిలిస్తే రాత్రి భోజనం చేసి వస్తామని చెప్పి గదిలోనే ఉండి పోయారు. ఈరోజు మధ్యాహ్న భోజన సమయంలో కూడా వారు రాకపోవడంతో ఓ విద్యార్థిని అనుమానం వచ్చి గదిలోకి వెళ్లి చూడగా షాక్ తిన్నారు.

ఇద్దరు విద్యార్థినులు అప్పటికే ఫ్యాన్లకు వేలాడుతున్నారు. చూసిన వెంటనే విద్యార్థి యాజమాన్యానికి చెప్పింది. యాజమాన్యం వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఇద్దరినీ జిల్లా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను పరీక్షించిన వైద్యులు.. విద్యార్థినిలు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.

బాలికలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న గదిలో నుంచి సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో పేర్కొన్న అంశాలను చదివి పోలీసులు ఆశ్చర్య పోయారు.

మేము వెళ్లిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి.. మేం తప్పు చేయకపోయినా అందరూ మమ్మల్ని అంటుంటే ఆ మాటలు తీసుకోలేకపోతు న్నాం.

మమ్మల్ని మా శైలజ మేడం తప్ప ఎవరూ నమ్మలేదు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతు న్నాం.మా ఇద్దరినీ ఒకచోటే సమాధి చేయండి’ అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.

హాస్టల్ వార్డెన్ శైలజాన్, ట్యూషన్ టీచర్లను భువనగిరి టౌన్ పోలీసులు విచారిస్తున్నారు. కాగా.. ఈ బాలికలు తమను దూషించి.. చేయి చేసుకున్నారంటూ నలుగురు విద్యార్థినులు స్కూల్‌లో టీచర్‌కు చెప్పడంతో ఆ ఇద్దరికీ శనివారం కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

దీంతో తమపై వచ్చిన ఫిర్యాదుతో అవమానంగా భావించి ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో ఒక విద్యార్థి 3వ తరగతి నుంచి ఇదే హాస్టల్‌లో ఉంటున్న సంగతి తెలిసింది. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన వీరి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటున్నట్లు గుర్తించారు.