(శ్రీకాంత్ కోండ్రు,బాపట్ల)
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.
ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలకు, ప్రజావ్యతిరేక విధానాలకు విసిగి చంద్రబాబు చెంతకు చేరుకుంటున్నారు.
ఫలితంగా చంద్రబాబు ఇంటి వద్ద వైసీపీ నేతల క్యూ రోజురోజుకు పెరిగిపోతోంది.
జగన్ తీరును తీవ్రంగా వ్యతిరేకించిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఇప్పటికే తెలుగుదేశంలో చేరిన విషయం తెలిసిందే.
పెలమనూరు ఎమ్మెల్యే పార్థసారధి తెలుగుదేశం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తాజాగా నర్సరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. త్వరలో దేవరాయులు కూడా తెలుగుదేశం తీర్ధం పుచ్చుకోనున్నారు. మరోవైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా తెలుగుదేశంవైపు చూస్తున్నట్లు రాజకీయవర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకరెడ్డిలు సైతం టీడీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరు హైదరాబాద్ లో చంద్రబాబుతో భేటీ అయినట్లు ఏపీ రాజకీయాల్లో ప్రచారం జరుగుతున్నది. వీరితో పాటు వైసీపీలోని ద్వితీయ స్థాయి నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో టీడీపీలో చేరుతున్నారు.
జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ప్రజా సంక్షేమం మరిచి.. ప్రతిపక్ష పార్టీల నేతలపై కక్షసాధింపుకు చర్యలకు పాల్పడటానికే ప్రాధాన్యతనిస్తున్నారని పలువురు వైసీపీ నేతలు బాహాటంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కేవలం బటన్ నొక్కి ఖాతాల్లో డబ్బులేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని జగన్ పూర్తిగా విస్మరించారని, తద్వారా ఉపాధి కోసం యువత హైదరాబాద్, బెంగళూరు పోవాల్సి వస్తుందని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. నరసరావుపేట నుంచి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరేందుకు వైసీపీ సీనియర్ నేత అట్లా చిన్న వెంకటరెడ్డి వందకుపైగా కార్ల ర్యాలీతో చంద్రబాబు నివాసానికి వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతుండటంతో ఆ పార్టీ నేతలు తెలుగుదేశం, జనసేన పార్టీలవైపు చూస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండటంతో వైసీపీ శిభిరంలో ఆందోళన వ్యక్తమవుతోంది. జగన్ నియంతృత్వ పోకడతో ఇప్పటికే తలలు పట్టుకుంటున్న వైసీపీ సీనియర్ నేతలు.. కీలక నేతలుసైతం పార్టీని వీడుతుండటంతో ఏం చేయాలో, ఈ వలసలను ఎలా నిరోధించాలో తెలియక తలలు పట్టుకుంటున్న పరిస్థితి. తాజా పరిణామాలను చూసి.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురవ్వడం ఖాయమన్న భావనకు వైసీపీలోని సీనియర్ నేతలు ఇప్పటికే వచ్చేసినట్లు పార్టీ వర్గాలే చెబుతుతున్నాయి. మరోవైపు పలు సర్వేలుసైతం జగన్ కు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని తేటతెల్లం చేశాయి.
ఈసారి వైసీపీకి కనీసం 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాలుకూడా వచ్చే పరిస్థితి లేదని పలు ప్రధాన సర్వేలు కుండబద్దలు కొట్టాయి. దీంతో అలర్ట్ అవుతున్న జగన్ మోహన్ రెడ్డి.. ప్రజల్లో వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఏదోఒక విషయాన్ని తెరపైకి తెచ్చి ఏపీ ప్రజలను రెచ్చగొట్టేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తుండటం జనంలో జగన్ పట్ట ఆగ్రహాన్ని మరింత పెంచేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు అంతర్గత సర్వేలు చేయించుకుంటున్న జగన్.. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు టికెట్ నిరాకరిస్తున్నారు. వారి స్థానంలో వేరే ప్రాంతాలకు, వేరే జిల్లాలకు చెందిన నేతలను బరిలోకి దింపుతున్నారు. దీంతో స్థానికంగా ఉన్న వైసీపీ శ్రేణులు జగన్ తీరుపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. మా నేతను కాదని, ఎక్కడో వేరే ప్రాంతాలు, జిల్లల నేతలను తీసుకొచ్చి ఇక్కడ నిలబెడితే మేం ఎలా ఓటేస్తామంటూ వైసీపీ అధిష్టానాన్ని పలువురు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీంతో జగన్ వ్యూహం అట్టర్ ప్లాప్ కావడం ఖాయమని వైసీపీ సీనియర్ నేతలే ఆందోళన చెందుతున్నారు.
మొత్తానికి జగన్ తీరుతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూడబోతుందని సర్వేల్లో తేటతెల్లం కావడంతోపాటు.. రాష్ట్ర ప్రజలు, వైసీపీ శ్రేణులుసైతం అభిప్రాయ పడుతున్నారు.