తమ హక్కుల సాధన కోసం హర్యానా, పంజాబ్, యూపీ రైతులు ఢిల్లీ బాట పట్టిన విషయం తెలిసిందే. తమ సమస్యల పరిష్కారం కోసం దేశ రాజధానిలో ధర్నాలు, రాస్తారోకోలతో హోరోత్తిస్తున్నారు. ఉద్యమంపై పట్టు వదలని రైతులు ఢిల్లీని వీడటం లేదు. పోలీసులు ఈ ర్యాలీని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ బారికేడ్లతో బ్రేకులు వేస్తున్నారు. అయినా రైతులు వెనక్కి తగ్గకపోవడంతో సరిహద్దుల్లో రెండోరోజూ హైటెన్షన్ నెలకొంది. ఢిల్లీ మార్చ్‌కి వచ్చిన వందలాది ట్రాక్టర్లు హైవేపై నిలిచిపోయాయి. ఇంకా ఢిల్లీకి 200 కిలో మీటర్ల దూరంలోనే రైతుల ర్యాలీ కొనసాగుతోంది.
అయితే రైతుల పోరుబాటతో ఢిల్లీ ఒక్కసారిగా స్తంబించిపోయింది. ఢిల్లీవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సరిహద్దుల్లో హైవేలపై బారికేడ్లు, కాంక్రీట్ దిమ్మెలు, ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. ‘ఢిల్లీ చలో’ మార్చ్ నేపథ్యంలో సింగూ, టిక్రీ, ఘాజీపూర్‌లో హైసెక్యూరిటీ ఏర్పాటు చేశాయి భద్రతా దళాలు. ఎట్టిపరిస్థితుల్లో రైతులు ఢిల్లీ రాకుండా ఆంక్షలు విధించారు. సింగూ సరిహద్దులో రోడ్లపై పెద్ద సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. వందలాదిగా సిమెంట్ దిమ్మల్ని అడ్డంగా పెట్టేశారు. దీంతో ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
అయితే రైతుల ధర్నాలతో ఢిల్లీలో ఎక్కడా చూసినా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో రాజధాని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే కేంద్రం ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రైతు సంఘాలను మరోసారి చర్చలకు పిలిచింది. రాజకీయ పార్టీలతో కలిసి రైతులు తప్పుదారి పట్టొదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముండా సూచించారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ముందుకు రావాలి ఆయన కోరారు. అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీ రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేసి రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఈ రైతు ఉద్యమాలకు కొన్ని పార్టీలు మద్దతు ఇస్తుండగా, మరొకొని పార్టీలు మౌనం పాటిస్తుండటం గమనార్హం.