TRINETHRAM NEWS

నెల్లూరులోని జాతీయ రహదారి-16పై అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు?

రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు,
సమాధానమిచ్చిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

ఈ రోజు రాజ్యసభ సభ్యులు, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు.. రాజ్యసభలో జాతీయ రహదారుల అంశంపై ప్రశ్నించారు. 2019లో ఎన్.హెచ్.ఎ.ఐ(జాతీయ రహదారు ల ప్రాధికార సంస్థ) ద్వారా ఆంధ్రప్రదేశ్‌ లోని నెల్లూరు జిల్లా గొలగమూడి జంక్షన్, చింతారెడ్డిపాలెం జంక్షన్ల వద్ద రెండు వెహికల్ అండర్ పాసులు, బుజబుజనెల్లూరు వద్ద రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఏదైనా ప్రతిపాదన ఉందా, అయితే, పైప్రాజెక్టులపై ఎన్.హెచ్.ఎ.ఐ సర్వే పూర్తి చేయడంలో జాప్యానికి గల కారణాలు, సర్వేను ఏ తేదీలోగా పూర్తి చేస్తారు, ఎన్.హెచ్.ఎ.ఐ. డీపీఆర్‌ను ఎప్పుడు ప్రారంభిస్తుంది? అండర్‌ పాస్‌లు, ఫ్లైఓవర్లను ఎప్పటిలోగా పూర్తి చేస్తుందన్న వివరాలను కోరారు.

ఈ ప్రశ్నలకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ శ్రీరామ్‌ గడ్కరీ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా గొలగమూడి జంక్షన్, సుందరయ్య కాలనీ జంక్షన్ మరియు బుజబుజనెల్లూరు వద్ద NH-16లో అభివృద్ధి పనులను ఇప్పటికే గుర్తించామన్నారు. గొలగమూడి జంక్షన్ వద్ద వెహికల్ అండర్ పాస్ (VUP), నెల్లూరు T- జంక్షన్(బుజబుజనెల్లూరు) వద్ద ఫ్లైఓవర్ మరియు సుందరయ్య కాలనీ జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు మంజూరయ్యాయన్నారు. అయితే చింతారెడ్డిపాళెం జంక్షన్‌లో వెహికల్ అండర్ పాస్ (VUP) నిర్మాణ ప్రతిపాదన పరిశీలనలో లేదని వివరించారు.

శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారి కార్యాలయం,
నెల్లూరు.