TRINETHRAM NEWS

ఇంటి నుంచే ఓటు వేయండి

_అమల్లోకి కొత్త పద్ధతి

ఎలా వేయాలంటే ..?

త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చింది. వయోవృద్ధుల్ని , వికలాంగులను గౌరవిస్తూ ఇంటినుంచే ఓటు వేసే సౌకర్యాన్ని కల్పించింది. ఇంటి వద్ద నుంచే ఓటు వేసే పద్ధతిని ఎలా అమలు చేయాలి, సాంకేతిక సమస్యల గురించి తెలుసుకుందాం..

కేంద్ర ఎన్నికల సంఘం ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశాన్ని దివ్యాంగులకు, వయోవృద్ధులకు కల్పించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. పల్నాడు జిల్లాలో 26,083 మంది దివ్యాంగులు, 25, 590మంది 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఉన్నారు. 58 మంది 100 సంవత్సరాలకు పైబడిన వృద్ధులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఇంటి నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే దివ్యాంగులు, వయోవృద్ధులు, కొవిడ్‌ రోగులు, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసిన ఐదు రోజుల్లోగా ఫారం-12డి ద్వారా తమ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. ఉంటుంది. దివ్యాంగ, వయోవృద్ధ ఓటర్లు ఉండే బీఎల్‌వోల వద్ద ఫారం-12 డి అందుబాటులో ఉంచనున్నారు. తమ పోలింగ్‌ కేంద్రం బీఎల్‌వోల వద్ద ఫారం-12డి తీసుకుని పూర్తి చేసి బీఎల్‌వోలకు లేదా ఆర్‌వోలకు అందజేయాలి. దరఖాస్తుల ఆధారంగా రిటర్నింగ్‌ అధికారులు వయోవృద్దులు, దివ్యాంగ ఓటర్ల ఇళ్ల వద్దకే పోస్టల్‌ బ్యాలెట్‌ను పంపిస్తారు. కాగా దివ్యాంగుల్లో 40శాతానికిపైగా వైకల్వత్వం ఉన్న ఓటర్లకే ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. అలాంటి వారు తమ వైకల్వత్వాన్ని ధ్రువీకరించుకునేందుకు సదరం సర్టిఫికెట్‌ను జత చేయాలి.

_రహస్య ఓటింగ్‌

ఇంటి వద్దనే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు, వయోవృద్దులు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఫారం-12డి ద్వారా దరఖాస్తు చేసుకున్న ఓటరు ఇంటికి ఎన్నికల సిబ్బంది మొబైల్‌ వాహనంలో చేరుకుని ఓటరుకు పోస్టల్‌ బ్యాలెట్‌ అందజేస్తారు. అధికారులు నిర్దేశించిన చోట ఓటరు రహస్యంగా తన ఓటు వేసి బ్యాలెట్‌ బాక్సులో వేయాల్సి ఉంటుంది. ఇద్దరు పోలింగ్‌ అధికారులు, పోలీసు అధికారితో పాటు ఓ వీడియో గ్రాఫర్‌ సమక్షంలో ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఓటరు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునే ప్రక్రియనంతా వీడియోగ్రఫీ చేయనున్నారు. ఈ ప్రక్రియను ఎన్నికలకు ఒకరోజు ముందుగానే పూర్తి చేస్తారు.